Ajit Agarkar | న్యూఢిల్లీ: భారత మాజీ ఆటగాడు అజిత్ అగార్కర్ బీసీసీఐ సీనియర్ పురుషుల సెలెక్షన్ కమిటీ చైర్మన్‌గా ఎన్నికయ్యాడు. క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ)లోని ముగ్గురు సభ్యులు ఏకగ్రీవంగా అగార్కర్ పేరును చీఫ్ సెలెక్టర్‌గా సూచించినట్లు బోర్డు కార్యదర్శి జై షా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపాడు.
జాతీయ జట్టు తరఫున 191 వన్డేలు, 26 టెస్టులు, 4 టీ20లు ఆడిన అగార్కర్.. ప్రస్తుత సెలెక్షన్ కమిటీ ప్యానల్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడు కావడంతో అతడే చైర్మన్‌గా వ్యవహరిస్తాడని సీఏసీ పేర్కొంది. 1999, 2003, 2007 వన్డే ప్రపంచకప్‌లలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన అగార్కర్.. 2007లో టీ20 ప్రపంచకప్ చేజిక్కించుకున్న టీమ్ఇండియాలోనూ సభ్యుడిగా ఉన్నాడు. వెస్టిండీస్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం అగార్కర్ జట్టును ఎంపిక చేయనున్నాడు.