ఫామ్ లేక ఇబ్బంది పడుతున్న అజింక్య రహానే.. మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు. అత్యంత కీలకమైన కేప్‌టౌన్ టెస్టులో 9 పరుగులకే పెవిలియన్ చేరాడు. భారత ఇన్నింగ్స్‌లో తొలి ఆరుగురు బ్యాటర్లలో రెండంకెల స్కోరు చేయని ఏకైక బ్యాటర్ రహానే మాత్రమే.
రెండో టెస్టులో అద్భుతంగా రాణించిన హనుమ విహారికి అవకాశం ఇవ్వకుండా.. రహానేను కొనసాగించడంపై ఇప్పటికే అభిమానులు గుర్రుగా ఉన్నారు. ఇలాంటి సమయంలో భారత జట్టు బ్యాటింగ్ కోచ్ విక్రమ్ ఠాకూర్ స్పందించాడు. తనకు లభించే ఆరంభాలను రహానే భారీ స్కోర్లుగా మలచాల్సిన అవసరం ఉందని అంగీకరించాడు.
అయితే రహానేకు మరిన్ని అవకాశాలు ఇస్తామని స్పష్టం చేశాడు. ప్రత్యామ్నాయాల కన్నా రహానేకు మరిన్ని అవకాశాలు ఇచ్చేందుకే టీమ్ మేనేజ్మెంట్ మొగ్గుచూపుతుందన్నాడు. రహానే నెట్స్‌లో చాలా బాగా బ్యాటింగ్ చేస్తున్నాడని, ఈ సిరీస్‌లో కూడా కొన్ని మంచి ఇన్నింగ్సులు ఆడాడని విక్రమ్ గుర్తుచేశాడు.
తనకు లభించిన ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచడమే ఇప్పుడు అతని ముందున్న సమస్య అని వివరించాడు. ఏదో ఒక ఇన్నింగ్స్‌లో అతను మంచి స్కోర్ చేస్తాడని టీమ్ మేనేజ్‌మెంట్‌గా ఆశిస్తున్నామని చెప్పాడు. అర్హత ఉందనుకున్న వారికి మరిన్ని అవకాశాలు ఇచ్చేందుకు తాము ప్రయత్నిస్తామని తేల్చిచెప్పాడు.