షిమ్కెంట్ (కజకిస్థాన్) : ఏషియన్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్లు పతకాల పంట పండిస్తున్నారు. ఆదివారం జరిగిన పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ విభాగంలో ఐశ్వర్య్ ప్రతాప్ సింగ్ తోమర్ స్వర్ణంతో సత్తాచాటాడు. ఫైనల్లో ఐశ్వర్య్.. 462.5 పాయింట్లు స్కోరు చేసి పసిడిని సొంతం చేసుకున్నాడు. వెన్యు ఝొ (చైనా) 462 స్కోరుతో రజతం గెలుచుకోగా జపాన్ షూటర్ ఒకాడ 442.1 స్కోరుతో కాంస్యం నెగ్గాడు.
2023లో ఏషియన్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన తోమర్‌కు ఇది రెండో పసిడి పతకం. 2024లో అతడు రజతంతో సరిపెట్టుకున్నాడు. ఇక ఫైనల్లో భారత్‌కే చెందిన చైన్ సింగ్, అఖిల్ వరుసగా 4,5 స్థానాల్లో నిలిచారు. అంతకుముందు ఇదే విభాగంలో ఐశ్వర్య్, చైన్ సింగ్, అఖిల్ రజతం గెలిచారు.