WFI Elections 2023: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)కు ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో అధ్యక్ష రేసులో పోటీ పడుతున్నవారిలో మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ అనుయాయులు ఉన్నారని, వారిని పోటీ నుంచి తప్పించాలని కోరుతూ పలువురు రెజ్లర్లు కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌ను కలిశారు. అధ్యక్ష రేసులో ఉన్న వారిలో బ్రిజ్ భూషణ్ విధేయుడిగా పేరున్న సంజయ్ సింగ్ కూడా ఉన్నాడు. అతడిని పోటీల నుంచి తొలగించాలని బజరంగ్ పునియా, సాక్షి మాలిక్‌లు అనురాగ్ ఠాకూర్‌ను కోరారు. సంజయ్ సింగ్‌తో పాటు 2010 కామన్వెల్త్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్ గెలుచుకున్న అనితా షేరోన్ కూడా అధ్యక్ష రేసులో ఉన్నారు. చాలాకాలంగా వాయిదాపడుతున్న డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్ష ఎన్నికలు డిసెంబర్ 21న జరుగనున్న విషయం తెలిసిందే. ఎన్నికలతో పాటు అదే రోజు ఫలితాలు వెలువడనున్నాయి.
ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసిన తర్వాత బజరంగ్ పునియా మాట్లాడుతూ.. ‘అవును. మేం అనురాగ్ ఠాకూర్‌ను కలిశాం. డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికలలో బ్రిజ్ భూషణ్ బంధువులు, విధేయులనెవరినీ పోటీ చేయనీయమని ఆయన మాకు గతంలో ఇచ్చిన హామీని గుర్తుచేశాం. ప్రస్తుతం అధ్యక్ష రేసులో ఉన్న సంజయ్ సింగ్.. బ్రిజ్ భూషణ్ మనిషే. ఆ ఇద్దరికీ మంచి సంబంధాలున్నాయి. అతడు తన అభ్యర్థిత్వాన్ని విరమించుకోవాలి. లేదంటే మేం త్వరలోనే మా తదుపరి కార్యాచరణను ప్రకటించాల్సి ఉంటుంది..’ అని చెప్పాడు.
#WATCH | Delhi: Wrestler Bajrang Punia says “We are hopeful that the Government will keep their promise. We have done everything according to the govt…” pic.twitter.com/NXtgd0Blx4
— ANI (@ANI) December 11, 2023
అధ్యక్ష రేసులో ఉన్న మరో అభ్యర్థి అనిత వంటి వ్యక్తులు గెలవాలని తాము కోరుకుంటున్నామని పునియా తెలిపాడు. వృత్తిరిత్యా రెజ్లర్ అయిన ఆమెకు తమ సమస్యలు తెలుసునని అటువంటి వాళ్లు అధ్యక్షులైతే తమకు మేలు జరుగుతుందని పునియా అన్నాడు.