IPL 2024 | మరో రెండు వారాల్లో మొదలుకావాల్సి ఉన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 17వ సీజన్‌కు ముందే ఢిల్లీ క్యాపిటల్స్‌కు భారీ షాక్ తగిలింది. కొద్దిరోజుల క్రితమే ముగిసిన ఐపీఎల్ వేలంలో రూ. 4 కోట్ల ధరతో ఢిల్లీ దక్కించుకున్న ఇంగ్లండ్ యువ క్రికెటర్ హ్యారీ బ్రూక్.. ఈ సీజన్ నుంచి తప్పుకున్నాడు. వ్యక్తిగత కారణాలతో అతడు ఐపీఎల్ – 17 నుంచి తప్పుకుంటున్నట్టు తెలుస్తోంది. మార్చి 22 నుంచి మొదలుకాబోయే ఈ లీగ్‌కు దూరమైన రెండో ఇంగ్లీష్ క్రికెటర్ బ్రూక్. రెండ్రోజుల క్రితం కోల్‌కతా నైట్ రైడర్స్ స్టార్ ఓపెనర్ అయిన జేసన్ రాయ్ కూడా వ్యక్తిగత కారణాలతో టోర్నీ నుంచి నిష్క్రమించిన విషయం విదితమే.
గడిచిన రెండేండ్లుగా ఇంగ్లండ్ టెస్టులలో ఆడుతున్న బజ్‌బాల్ విధానానికి కరెక్ట్‌గా సూట్ అయిన బ్రూక్ మిడిలార్డర్లో కీలక బ్యాటర్. కొద్దిరోజుల క్రితమే ఇంగ్లండ్ జట్టు.. భారత పర్యటనకు రాగా ఈ టూర్‌కు కూడా బ్రూక్ మిస్ అయ్యాడు. సరిగ్గా ఇంగ్లండ్ జట్టు భారత్‌కు రావడానికి కొద్దిరోజుల ముందే అతడు కుటుంబ కారణాలతో ఈ సిరీస్‌కు దూరమైనట్టు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఒక ప్రకటనలో వెల్లడించిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్ టెస్టు సిరీస్ ముగిసినా బ్రూక్ మాత్రం ఐపీఎల్‌కు కూడా దూరమవడం గమనార్హం.
🚨 Big blow for DC! Harry Brook out of IPL 2024 due to personal reasons. pic.twitter.com/9HsYeNfJSs
— CricketGully (@thecricketgully) March 13, 2024
గత సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ రూ. 13.25 కోట్ల భారీ ధరతో కొనుగోలు చేసినా బ్రూక్ దారుణంగా విఫలమయ్యాడు. 2023లో ఎస్ఆర్హెచ్కు ఆడుతూ 190 పరుగులు మాత్రమే చేసిన బ్రూక్‌ను ఆ ఫ్రాంచైజీ వేలానికి వదిలేసింది. దీంతో వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ అతడిని రూ. 4 కోట్లకు దక్కించుకుంది.