ముంబై : అనుకున్నదే జరిగింది! నిరుడు స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో అవమానకర ఓటమితో పాటు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ (ఆస్ట్రేలియాతో)లో టీమ్ఇండియా వైఫల్య ప్రదర్శన తర్వాత హెడ్‌కోచ్ గౌతం గంభీర్ కోచింగ్ బృందంపై వేటు తప్పకపోవచ్చునన్న పుకార్లను బీసీసీఐ నిజం చేసింది. గంభీర్ బృందంలో కీలకసభ్యుడిగా ఉన్న అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్‌పై వేటు వేసింది. నిరుడు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన తర్వాత అదే జట్టుకు మెంటార్‌గా ఉన్న గంభీర్‌ను టీమ్ఇండియాకు హెడ్‌కోచ్‌గా నియమించిన బీసీసీఐ.. నాయర్‌నూ గౌతీ బృందంలో చేర్చింది. కానీ టీమ్ఇండియా కోచింగ్ సభ్యుడిగా నాయర్ పదవీకాలం ఏడాది కూడా పూర్తికాకుండానే అతడిని తొలగించడం గమనార్హం. ఇక ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్‌తో పాటు స్ట్రెంత్ అండ్ కండీషనింగ్ కోచ్ సోహమ్ దేశాయ్‌ను వారి బాధ్యతల నుంచి రిలీవ్ చేసింది.
దిలీప్ జట్టుతో చేరి నిరుటికే మూడేండ్లు గడిచినా అతడి బాధ్యతలను మరో ఏడాది పాటు పొడిగించిన విషయం విదితమే. ఈ ఏడాది జూన్‌లో ఇంగ్లండ్‌తో కీలక ఐదు టెస్టుల సిరీస్‌కు ముందే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంగ్లండ్ సిరీస్‌కు ‘జంబో సపోర్టింగ్ స్టాఫ్’ అక్కర్లేదనే భావనలో ఉన్న బీసీసీఐ పెద్దలు.. గంభీర్ బృందానికి కత్తెర వేసినట్టు సమాచారం. నాయర్‌పై వేటు వేయడంతో బ్యాటింగ్ కోచ్‌గా సితాన్షు కోటక్‌ను పూర్తి స్థాయిలో కొనసాగించనున్నట్టు బోర్డు వర్గాల వినికిడి. బౌలింగ్ కోచ్‌గా మోర్నీ మోర్కెల్ ఉండగా.. రియాన్ డస్కటె ఫీల్డింగ్ బాధ్యతలను చూసుకునే అవకాశముంది. 2002-03 దాకా సౌరవ్ గంగూలీ సారథ్యంలోని భారత జట్టుకు స్ట్రెంత్ అండ్ కండీషనింగ్ కోచ్‌గా పనిచేసిన అడ్రియన్ లె రౌక్స్ (దక్షిణాఫ్రికా) తిరిగి భారత జట్టుతో కలవనున్నట్టు సమాచారం. అడ్రియన్ ప్రస్తుతం ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్‌కు సేవలందిస్తున్నాడు.