CWC 2023: ప్రపంచ క్రికెట్‌కు పెద్దన్న హోదాలో ఉండి వన్డే ప్రపంచకప్‌ను ఘనంగా నిర్వహిస్తున్న భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి స్థానికంగా ఉన్న సమస్యలు కొత్త తలనొప్పిని తీసుకొస్తున్నాయి. ఇదివరకే కర్నాటక రాజధాని బెంగళూరులో జరిగిన పాకిస్తాన్ –ఆస్ట్రేలియా మ్యాచ్‌లో కొద్దిసేపు విద్యుత్ అంతరాయంతో డీఆర్ఎస్ పనిచేయకపోవడంపై తీవ్ర విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా పశ్చిమబెంగాల్లోని కోల్‌కతాలో ఉన్న ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్ స్టేడియంలో గోడ కూలింది.
వరల్డ్ కప్ ప్రారంభమై సగం టోర్నీ ముగిసినా ఇప్పటిదాకా ఈడెన్ గార్డెన్లో ఒక్క మ్యాచ్ కూడా జరుగలేదు. అక్టోబర్ 28న నెదర్లాండ్స్.. బంగ్లాదేశ్‌తో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌కు ముందే స్టేడియానికి ఆనుకుని ఉన్న 3, 4వ గేటుకు మధ్యలో ఉన్న గోడకు బుల్డోజర్ తాకడంతో అది పాక్షికంగా దెబ్బతింది ఈ గోడకు ఆనుకుని ఫ్లడ్‌లైట్ స్టాండ్ కూడా ఉండటం గమనార్హం. వరల్డ్ కప్‌లో భాగంగా ఈడెన్ గార్డెన్లో బంగ్లాదేశ్-నెదర్లాండ్స్ మ్యాచ్‌తో పాటు నవంబర్ ఐదున భారత జట్టు దక్షిణాఫ్రికాతో మ్యాచ్ ఆడనుంది. నవంబర్ 11న ఇంగ్లాండ్.. పాకిస్తాన్‌తో ఆడాల్సి ఉంది. అంతేగాక నవంబర్ 16న సెమీస్ మ్యాచ్ జరునగుంది.
గోడ కూలిన ఘటనకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవడంతో పలువురు బీసీసీఐతో పాటు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) ను ట్రోల్ చేస్తున్నారు. శనివారం మ్యాచ్ ఉండటంతో క్యాబ్.. ఆగమేఘాల మీద గోడ మరమ్మతు పనులు పూర్తిచేయాలని ఆదేశించింది. భారత్‌లో ‘క్రికెట్ మక్కా’గా భావించే ఈడెన్ గార్డెన్‌ను 1864లో నిర్మించారు. 66 వేల సీటింగ్ కెపాజిటీ ఉన్న ఈ స్టేడియంలో జరుగబోయే తొలి మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా వేచిచూస్తున్నారు.