Asia Cup | ఆసియా కప్‌లో యూఏఈతో జరగాల్సిన చివరి గ్రూప్ దశ మ్యాచ్‌ను పాకిస్తాన్ జట్టు బహిష్కరించాలని నిర్ణయించింది. ఈ మేరకు జియో న్యూస్ కథనం వెల్లడించింది. ఇటీవల మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌తో జరిగిన ‘కరచాలనం’ వివాదం నేపథ్యంలో యూఏఈతో మ్యాచ్‌ను బహిష్కరించాలని నిర్ణయించినట్లు జియో న్యూస్ పేర్కొంది. పాకిస్తాన్ బోర్డు జాతీయ జట్టును హోటల్‌కే పరిమితం కావాలని.. స్టేడియానికి వెళ్లకూడదని ఆదేశించింది. ఈ క్రమంలో ఆటగాళ్లు వారి గదుల్లోనే ఉన్నారని.. కిట్లు, సామగ్రి అంతా జట్టు బస్సులోనే ఉన్నట్లుగా సమాచారం. ఈ విషయంపై త్వరలోనే అత్యవసర విలేకరుల సమావేశం నిర్వహించనున్నట్లు మీడియా నివేదికలు తెలిపాయి. పాక్ నిర్ణయం నేపథ్యంలో స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్ అనిశ్చితిలో ఉన్నది. యూఏఈ జట్టు ఇప్పటికే స్టేడియానికి చేరుకుంది.
ఈ మ్యాచ్‌కు పైక్రాఫ్ట్ రిఫరీగా తొలగించాలని పీసీబీ చేసిన ప్రయత్నం విఫలమైంది. ఆ తర్వాత పాక్ బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తున్నది. పీసీబీ అధికారికంగా ఐసీసీకి ఫిర్యాదు చేసినా.. సీనియర్ రిఫరీని తొలగించి.. మరొకరికి బాధ్యతలు అప్పగించేందుకు నిరాకరించింది. ఇటీవల పాక్-భారత్ మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. టాస్ వేసే సమయంలో పాక్ కెప్టెన్ సల్మాన్ అఘాకు మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ షేక్ హ్యాండ్ ఇవ్వకూడదని చెప్పాడని పాక్ జట్టు ఆరోపించింది.
ఇప్పటికే ఇరుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత ఆ దేశంతో మ్యాచ్ ఆడకూడదని దేశవ్యాప్తంగా డిమాండ్లు వినిపించాయి. కేంద్రం అనుమతితో బీసీసీఐ మ్యాచ్ ఆడేందుకు అంగీకరించింది. మ్యాచ్‌కు ముందు ఆనవాయితీ ప్రకారం జట్ల షీట్స్ మార్పిడిని అడ్డుకొని దౌత్యపరమైన ఉద్రిక్తతలకు కారణమయ్యాడని.. ఇది అన్యాయం, పక్షపాతమంటూ పీసీబీ ఆరోపించింది. మ్యాచ్ తర్వాత సైతం పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేసేందుకు టీమిండియా ప్లేయర్లు ఇష్టపడలేదు. మ్యాచ్ తర్వాత సూర్యకుమార్ యాదవ్ నేరుగా డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోయాడు. దీన్ని సూర్యకుమార్ సమర్థించుకున్నాడు. ఉగ్రవాద దాడి బాధితులకు సంఘీభావం, భద్రతా బలగాలకు, ఆపరేషన్ సిందూర్‌కు మద్దతుగా షేక్ హ్యాండ్ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
యూఏఈతో మ్యాచ్‌కు రిఫరీగా పైక్రాఫ్ట్‌ను తొలగించకపోతే టోర్నీ నుంచి వైదొలగుతామని పీసీబీ హెచ్చరించింది. అయినా, ఐసీసీ డిమాండ్‌ను తిరస్కరించింది. మ్యాచ్‌ను బహిష్కరిస్తే పాక్ బోర్డు కీలక పరిణామాలను ఎదుర్కొనే అవకాశం ఉంది. పాక్ దాదాపు 16 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని కోల్పోనుంది. దాంతో పాటు క్రమశిక్షణా చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆసియా క్రికెట్ కౌన్సిల్ చీఫ్‌గా మొహ్సిన్ నఖ్వీ కొనసాగుతున్నారు.