వన్డే ప్రపంచకప్‌లో చిన్న జట్టుగా ప్రస్థానాన్ని ప్రారంభించిన అఫ్గాన్ అద్వితీయ ఆటతీరుతో దూసుకెళ్తున్నది. ఇప్పటికే ఇంగ్లండ్, పాకిస్థాన్‌లను మట్టికరిపించిన కాబూలీలు.. తాజాగా లంకేయులపై తమ ప్రతాపం చూపారు. మొదట కట్టుదిట్టమైన బౌలింగ్‌తో లంకను కట్టడి చేసిన అఫ్గాన్ ఆ తర్వాత.. సాధికారిక బ్యాటింగ్‌తో ప్రపంచకప్‌లో మూడో గెలుపు ఖాతాలో వేసుకుంది. ఈ మూడు విజయాలు మాజీ చాంపియన్లపైనే కావడం మరో విశేషం.
పుణె: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన అఫ్గానిస్థాన్ ప్రతిష్ఠాత్మక వన్డే వరల్డ్‌కప్‌లో వరుసగా రెండో విజయం ఖాతాలో వేసుకుంది. గత మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను చిత్తు చేసిన అఫ్గాన్.. ఈసారి లంకను అవలీలగా దాటేసింది. సోమవారం జరిగిన పోరులో అఫ్గాన్ 7 వికెట్ల తేడాతో శ్రీలంకపై గెలిచింది. దీంతో ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో మూడు విజయాలతో 6 పాయింట్లు ఖాతాలో వేసుకున్న అఫ్గాన్ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి చేరింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన లంక 49.3 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. పాథుమ్ నిషాంక (46) టాప్ స్కోరర్ కాగా.. కెప్టెన్ కుషాల్ మెండిస్ (39), సదీర సమరవిక్రమ (36) పర్వాలేదనిపించారు.
తక్కినవాళ్లకు కూడా మంచి ఆరంభాలు లభించినా వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. చివర్లో ఏంజెలో మాథ్యూస్ (23), తీక్షణ (29) విలువైన పరుగులు చేశారు. అఫ్గాన్ బౌలర్లలో ఫజల్ హక్ 4 వికెట్లు పడగొట్టగా.. ముజీబ్ రెండు వికెట్లు తీశాడు. అనంతరం లక్ష్యఛేదనలో అఫ్గానిస్థాన్ 45.2 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసింది. అజ్మతుల్లా ఓమర్జాయ్ (73 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), రహ్మత్ షా (62; 7 ఫోర్లు), కెప్టెన్ హష్మతుల్లా షాహిది (58 నాటౌట్) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. లంక బౌలర్లలో మధుషనక 2 వికెట్లు పడగొట్టాడు. ఫజల్హక్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’అవార్డు దక్కింది.
వన్డే ప్రపంచకప్‌లో భాగంగా అఫ్గాన్ తొలుత ఆడిన 17 మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క విజయం మాత్రమే (స్కాట్లాండ్పై 2015లో) నమోదు చేసుకోగా.. తాజా టోర్నీలో ముగ్గురు మాజీ చాంపియన్లను చిత్తుకింద కొట్టింది.
వరల్డ్‌కప్ చరిత్రలో అత్యధిక పరాజయాలు (43) మూటగట్టుకున్న జట్టుగా లంక రికార్డుల్లోకి ఎక్కింది. జింబాబ్వే (42) రెండో స్థానంలో ఉంది.
శ్రీలంక: 49.3 ఓవర్లలో 241 ఆలౌట్ (నిషాంక 46; ఫజల్హక్ 4/34, ముజీబ్ 2/38), అఫ్గానిసాన్: 45.2 ఓవర్లలో 242/3 (అజ్మతుల్లా 73 నాటౌట్, రహ్మత్ షా 62; మధుషనక 2/48).