T20 World Cup | టీ20 వరల్డ్ కప్‌లో (T20 World Cup) మరో సంచలనం నమోదయింది. సూపర్-8 పోరులో ఆస్ట్రేలియాపై అఫ్ఘానిస్థాన్ 21 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన అప్ఘాన్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 148 రన్స్ చేసింది. ఓపెనర్లు గుర్బాజ్ (60), ఇబ్రహీం జద్రాన్ (51) అర్ధ సెంచరీలతో అదరగొట్టారు. ఆసీస్ పేసర్ ప్యాట్ కమిన్స్ టీ20 ప్రపంచకప్‌లో వరుసగా రెండోసారి హాట్రిక్ వికెట్లు తీశాడు.
కాగా, స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడానికి ఆసీస్ బ్యాట్స్‌మెన్ అష్టకష్టాలు పడ్డారు. అఫ్ఘాన్ బౌలర్ల ధాటికి సహచరులంతా వెనుతిరుగుతున్నా గ్లెన్ మ్యాక్స్ వెల్ ఒంటరి పోరాటం చేశాడు. 59 పరుగులు చేసిన అతడు.. అవతలి ఎండ్ నుంచి సపోర్ట్ లభించకపోవడంతో జట్టును విజయ తీరాలకు చేర్చలేకపోయాడు. చివరికి 19.2 ఓవర్లలో 127 రన్స్మాత్రమే చేసిన ఆసీస్ ఓటమిని మూటగట్టుకున్నది. జట్టులో మిచెల్ మార్ష్, మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టొయినీస్ మాత్రమే రెండంకెల స్కోర్లు చేయడం గమనార్హం.
అఫ్ఘాన్ విజయంలో బౌలర్ గుల్బాదిన్ నైబ్ కీలకపాత్ర పోషించాడు. 20 పరుగులు మాత్రమే ఇచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టాడు. నవీనుల్ హక్ 3 వికెట్లు తీయగా, రషీద్ ఖాన్, ఒమర్జాయ్ చెరో వికెట్ తీశారు. దీంతో గ్రూప్-1లో చెరో గెలుపుతో ఆసీస్, అఫ్ఘాన్ సెమీస్ రేసులో నిలిచాయి. భారత్ ఇప్పటికే సెమీస్ బెర్తును దాదాపు ఖరారు చేసుకున్న విషయం తెలిసిందే.

ఆస్ట్రేలియా స్టార్ పేస్ బౌలర్ ప్యాట్ కమ్మిన్స్ (Pat Cummins) చరిత్ర సృష్టించాడు. టీ20 వరల్డ్‌కప్‌లో రెండు సార్లు హ్యాట్రిక్ నమోదు చేసిన తొలి బౌలర్‌గా కమ్మిన్స్ రికార్డులకెక్కాడు. టీ20 ప్రపంచకప్ సూపర్ 8 స్టేజ్‌లో భాగంగా ఇవాళ కింగ్స్టన్ వేదికగా జరిగిన ఆఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌లో హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టిన కమ్మిన్స్.. ఈ అరుదైన ఘనతను అందుకున్నాడు.
31 ఏళ్ల కమ్మిన్స్.. ఇన్నింగ్స్ 18వ ఓవర్ చివరి బంతిలో అఫ్గానిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్‌ను ఔట్ చేశాడు. ఆ తర్వాత 20వ ఓవర్లో వరుస బంతుల్లో కరీం జనత్, గుల్బాదిన్ నైబ్‌లను ఔట్ చేసి హ్యాట్రిక్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతకుముందు ఇదే వరల్డ్‌కప్ సూపర్ 8 స్టేజ్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ కమ్మిన్స్ హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టి సత్తాచాటాడు. దీంతో వరల్డ్‌కప్ చరిత్రలోనే రెండు సార్లు హ్యాట్రిక్ నమోదు చేసిన తొలి బౌలర్‌గా కమ్మిన్స్ నిలిచాడు.
కమ్మిన్స్ టీ20 కెరీర్లో అతనికి ఇది ఫస్ట్ హ్యాట్రిక్. జూనియర్స్ ఆడుతున్న సమయంలో కొన్ని హ్యాట్రిక్ వికెట్లు తీశానని, కానీ ఆస్ట్రేలియా తరపున హ్యాట్రిక్ తీయడం ఇదే మొదటిసారి అని ప్యాట్ కమ్మిన్స్ తెలిపాడు. ఆసీస్ తరపున గతంలో ఆస్టన్ అగర్, నాథన్ ఎల్లిస్‌లు టీ20ల్లో హ్యాట్రిక్ తీశారు. ఆ క్లబ్లో చేరడం సంతోషంగా ఉందన్నాడు.
గతంలో ఆస్ట్రేలియా తరపున టీ20ల్లో బ్రెట్ లీ హ్యాట్రిక్ తీశాడు. 2007 వరల్డ్‌కప్‌లో అతను ఆ రికార్డును నమోదు చేశాడు. 17 ఏళ్ల తర్వాత మళ్లీ ఆసీస్ బౌలర్ వరల్డ్‌కప్‌లో హ్యాట్రిక్ తీయడం విశేషం. 2021లో వరల్డ్‌కప్‌లో ఐర్లాండ్ బౌలర్ కర్టిస్ క్యాంపర్, శ్రీలంక స్పిన్నర్ హసరంగ, సౌతాఫ్రికా బౌలర్ రబడలు తమ పేరిట హ్యాట్రిక్ నమోదు చేశారు. ఇక 2022లో యూఏఈ బౌలర్ కార్తీక్ మరియప్పన్, ఐర్లాండ్ బౌలర్ జోషువా లిటిల్ హ్యాట్రిక్ తీసుకున్నారు.