AFG vs SL: వన్డే ప్రపంచకప్‌లో అగ్రశ్రేణి జట్లను సైతం సవాల్ చేస్తున్న అఫ్గానిస్తాన్ మరోసారి అదరగొట్టింది. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో అదరగొట్టి వరల్డ్ కప్‌లో మూడో విజయాన్ని నమోదుచేసింది. ఇంగ్లండ్, పాకిస్తాన్లకు షాకిచ్చిన అఫ్గానిస్తాన్.. సోమవారం పూణే వేదికగా జరిగిన మ్యాచ్‌లో శ్రీలంకనూ ఓడించి సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. తొలుత బౌలింగ్ చేసి లంకను 241 పరుగులకే కట్టడి చేసిన అఫ్గాన్.. ఛేదనలో 45.2 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. రహ్మత్ షా (74 బంతుల్లో 62, 7 ఫోర్లు) రాణించగా.. కెప్టెన్ హష్మతుల్లా షాహిది (74 బంతుల్లో 58 నాటౌట్, 2 ఫోర్లు, 1 సిక్సర్), అజ్మతుల్లా ఒమర్జయ్ (62 బంతుల్లో 72 నాటౌట్, 6 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయంగా నిలిచి ఆ జట్టుకు తిరుగులేని విజయాన్ని అందించారు. ఈ మ్యాచ్‌లో గెలుపుతో పాయింట్ల పట్టికలో అఫ్గాన్.. లంక, పాకిస్తాన్లను వెనక్కినెట్టి ఐదో స్థానానికి దూసుకెళ్లింది.
లంకేయులు నిర్దేశించిన మోస్తారు లక్ష్య ఛేదనలో అఫ్గాన్‌కు తొలి ఓవర్లోనే భారీ షాక్ తగిలింది. ఆ జట్టు ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ పరుగులేమీ చేయకుండానే ఔట్ అయ్యాడు. దిల్షాన్ మధుశంక అద్భుతమైన ఇన్‌స్వింగర్‌తో గుర్బాజ్‌ను బౌల్డ్ చేశాడు. స్కోరుబోర్డుపై పరుగుల ఖాతా తెరవడానికంటే ముందే అఫ్గాన్ వికెట్ల ఖాతా తెరిచింది. కానీ మరో ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ (57 బంతుల్లో 39, 4 ఫోర్లు, 1 సిక్సర్) కు జతకలిసిన రహ్మత్ షా రెండో వికెట్‌కు 73 పరుగులు జోడించారు. లంక బౌలర్లు కవ్వించే బంతులు వేసినా అనవసర షాట్ల జోలికి పోకుండా ఇన్నింగ్స్‌ను నిర్మించారు. తొలి పవర్ ప్లేలో ఓవర్‌కు ఒక బౌండరీ చొప్పున రన్‌రేట్ పడిపోకుండా ఆడిన ఈ జోడీని మధుశంక విడదీశాడు. అతడు వేసిన 17వ ఓవర్లో షార్ట్ బాల్‌ను ఆడబోయి థర్డ్ మ్యాన్ వద్ద ఉన్న కరుణరత్నె చేతికి చిక్కాడు.
జద్రాన్ స్థానంలో వచ్చిన కెప్టెన్ హష్మతుల్లా షాహిది కూడా లంక బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. రహ్మత్ షా – హష్మతుల్లాల జోడీ అంతగా అనుభవం లేని లంక పేసర్లతో పాటు మహీశ్ తీక్షణ, ధనంజయ డిసిల్వల స్పిన్ దాడిని సమర్థంగా ఎదుర్కుంది. మూడో వికెట్‌కు ఈ ఇద్దరూ 58 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదుచేశారు. 61 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తిచేసిన రహ్మతుల్లా.. కసున్ రజిత వేసిన 28వ ఓవర్లో ఆఖరి బంతికి కరుణరత్నెకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
Afghanistan secure their third win of #CWC23 – a comfortable victory against Sri Lanka in Pune! 🇦🇫https://t.co/b2xKadlyNH | #AFGvsL pic.twitter.com/ZMK1QiKTM0
— ESPNcricinfo (@ESPNcricinfo) October 30, 2023
28 ఓవర్లో 3 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసిన అఫ్గాన్ మరో వికెట్ కోల్పోకుండా విజయం దిశగా దూసుకెళ్లింది. అజ్మతుల్లా ఒమర్జయ్ తో కలిసి కెప్టెన్ హష్మతుల్లా అప్గాన్‌ను విజయతీరాలకు చేర్చాడు. క్రీజులో కుదురుకున్న తర్వాత ఈ ఇద్దరూ లంక బౌలర్లను అలవోకగా ఎదుర్కున్నారు. తీక్షణ, చమీర వేసిన ఓవర్లలో అజ్మతుల్లా భారీ సిక్సర్లు బాదాడు. మధుశంక వేసిన 42వ ఓవర్లో తొలి బంతికి సింగిల్ తీసి 61 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. మరుసటి ఓవర్లో అజ్మతుల్లా కవర్ పాయింట్ దిశగా సింగిల్ తీసి అతడు కూడా అర్థ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. ఈ ప్రపంచకప్‌లో అతడికి ఇది రెండో హాఫ్ సెంచరీ. చివర్లో బౌండరీలతో విరుచుకుపడిన అఫ్గాన్ విజయాన్ని ఖాయం చేశారు. ఈ ఇరువురూ నాలుగో వికెట్‌కు 104 బంతుల్లోనే 111 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. లంక బ్యాటర్లను అఫ్గాన్ బ్యాటర్లు కట్టడి చేసిన చోట మెండిస్ సేన మాత్రం ఆ మ్యాజిక్‌ను అందుకోలేక ఈ టోర్నీలో నాలుగో ఓటమిని మూటగట్టుకుంది.