Lokesh Kanagaraj | లోకేష్ కనగరాజ్ స్నేహితుడు, రచయితగా ఆయన చిత్రాలకు (మాస్టర్, విక్రమ్, లియో) పనిచేసిన రత్న కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ’29’. ఈ సినిమా టైటిల్ టీజర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు.
కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ సినిమాలకు రచనలో భాగస్వామిగా ఉంటూ మాస్టర్, విక్రమ్, లియో వంటి సినిమాలను తెరకెక్కించడమే కాకుండా.. ‘మేయాత మాన్’, ‘ఆడై’ వంటి విభిన్న చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న రత్న కుమార్ మళ్లీ మెగా ఫోన్ పట్టారు. ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ’29’. ఈ సినిమా టైటిల్ టీజర్‌ను తాజాగా చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.
ఈ సినిమా టీజర్ చూస్తుంటే.. చెన్నై నగరంలో 29 ఏండ్ల వయసున్న సత్య అనే యువకుడి చూట్టు ఈ కథ ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఒక వ్యక్తికి 29 ఏళ్ల వయసు అంటే అది కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదు.. బాధ్యతలు, గమ్యం మరియు వ్యక్తిగత అస్తిత్వం కోసం చేసే ఒక పోరాటం అనే కోణంలో ఈ సినిమా ఉండబోతున్నట్లు టీజర్ హింట్ ఇచ్చింది. విధు (Vidhu), ప్రీతి అస్రాని (Preethi Asrani) ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మాస్టర్ మహేంద్రన్, అవినాష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (G Squad) మరియు కార్తీక్ సుబ్బరాజ్ (Stone Bench Films) సంయుక్తంగా నిర్మిస్తుండటం విశేషం. ఈ చిత్రం 2026 ఫిబ్రవరి లేదా మార్చి నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.