Afghanistan Cricket Board : భారత పర్యటనకు ముందు అఫ్గనిస్థాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. స్టార్ బౌలర్లు ముజీబ్ ఉర్ రెహ్మాన్(Mujeeb Ur Rahman), ఫజల్హక్ ఫారూఖీ(Fazalhaq Farooqi), నవీన్ ఉల్ హక్(Naveen Ul Haq)లపై విధించిన ఆంక్షలను ఎత్తేసింది. ఐపీఎల్‌తో పాటు టీ20 లీగ్స్‌లో ఆడేందుకు ఈ ముగ్గురికి ఎన్ఓసీ(No Objection Certificate) ఇచ్చేందుకు అంగీకరించింది. అంతేకాదు సెంట్రల్ కాంట్రాక్ట్ కూడా కట్టబెట్టేందుకు సిద్ధమైంది. అయితే.. దేశానికే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని, అఫ్గన్ క్రికెట్ అవసరాలకు కట్టుబడి ఉండాలని ముజీబ్, నవీన్, ఫారుఖీకి తేల్చి చెప్పింది.
అఫ్గనిస్థాన్ జట్టులో కీలకమైన ముజీబ్, నవీన్, ఫారుఖీలు నిరుడు తమకు సెంట్రల్ కాంట్రాక్ట్ వద్దని బోర్డుకు తెలిపారు. దాంతో, ఈ ముగ్గురికి దేశం కంటే వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యమైనందున.. ఐపీఎల్‌తో పాటు ఇతర ఫ్రాంచైజీ లీగ్స్‌లో ఆడకుండా వీళ్లపై బోర్డు రెండేండ్ల పాటు నిషేధం విధించింది. గతంలో ఈ ముగ్గురికి ఇచ్చిన ఎన్ఓసీని ఏసీబీకి చెందిన ప్రత్యేక కమిటీ రద్దు చేసింది.
🏆 Afghanistan Tour of India 2024!
🏏 Three-Match T20I Series
📆 January 11-17
🏟️ Mohali, Indore, BengaluruAfghanAtalan, the pride of Afghanistan!#AfghanAtalan | #INDvAFG2024 pic.twitter.com/5jrlOnBY6a
— Afghanistan Cricket Board (@ACBofficials) January 9, 2024
అంతేకాదు వీళ్లకు ఏడాది పాటు సెంట్రల్ కాంట్రాక్ట్ ఇవ్వకూడదని తీర్మానించింది. అయితే.. ఈ ఏడాది వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న టీ20 వరల్డ్ కప్‌లో అఫ్గన్ జట్టుకు ఈ ముగ్గురు చాలా కీలకం. అందుకనే వీళ్లపై ఆంక్షలు ఎత్తేయాలని బోర్డు పెద్దలు నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.
ఐపీఎల్లో ముజీబ్ కోల్‌కతా నైట్ రైడర్స్‌కు, ఫారూఖీ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడుతుండగా.. నవీన్ లక్నో సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. వీళ్లతో పాటు అఫ్గన్ టీ20 సారథి రషీద్ ఖాన్, యంగ్‌స్టర్ నూర్ అహ్మద్‌లు గుజరాత్ టైటాన్స్(Gujarat Titans)కు ఆడుతున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఐపీఎల్ 17వ సీజన్ షురూ కానుంది.