BCCI |భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) షాకింగ్ నిర్ణయం తీసుకున్నది. అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్, ఫీల్డింగ్ కోచ్ దిలీప్‌ను తప్పించింది. ఆస్ట్రేలియా వేదికగా జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇద్దరిని తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్ 1-3 తేడాతో ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహరించిన అభిషేక్ నాయర్‌కు ఉద్వాసన పలకాలని బోర్డు నిర్ణయించినట్లు జాతీయ మీడియా నివేదిక పేర్కొన్నారు. అయితే, ఈ వ్యవహారంపై ఇప్పటి వరకు బీసీసీఐ అధికారికంగా స్పందించలేదు. ఎనిమిది నెలల కిందట గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన సమయంలో అభిషేక్ నాయర్‌ను అసిస్టెంట్ కోచ్‌గా బీసీసీఐ నియమించింది. తాజాగా నాయర్‌ను అసిస్టెంట్ కోచ్ బాధ్యతల నుంచి తప్పించింది. ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్‌తో పాటు స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ సోహమ్ దేశాయ్‌లను సైతం తొలగించినట్లు తెలుస్తున్నది.
2024 టీ20 ప్రపంచకప్ తర్వాత రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగిసిన తర్వాత బీసీసీఐ గంభీర్‌ను హెడ్‌కోచ్‌గా నయమించింది. కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు గంభీర్ మెంటార్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఆ జట్టులో పని చేసిన అభిషేక్ నాయర్, ర్యాన్ టెన్ డోస్చాట్‌ను గంభీర్ సపోర్టింగ్ స్టాఫ్‌గా తీసుకున్నాడు. మోర్నే మోర్కెల్ లక్నో సూపర్ జెయింట్స్‌లో గంభీర్‌తో కలిసి పనిచేశాడు. ద్రవిడ్ పదవీకాలం నుంచి దిలీప్ ఫీల్డింగ్ కోచ్‌గా పని చేశాడు. అయితే, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో ఘోర పరాజయం తర్వాత అభిషేక్ పనితీరుపై ప్రశ్నలు తలెత్తాయి. ఈ క్రమంలో బీసీసీఐ టీమిండియా ఏ కోచ్ సితాన్షు కొటక్‌ను బ్యాటింగ్ కోచ్‌గా నియమించింది. ఆ తర్వాత టీమిండియా చాంపియన్స్ ట్రోఫీని గెలిచింది. ఆ సమయంలోనూ అభిషేక్, ర్యాన్ టెన్, మోర్కెల్, దిలీప్ కూడా జట్టు సిబ్బందిగా కొనసాగారు. తాజాగా అభిషేక్, దిలీప్, సోహంను తొలగించగా.. మిగతా వారు కొనసాగనున్నారు. ప్రస్తుతానికి, టి దిలీప్ స్థానంలో అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోస్చేట్ తాత్కాలికంగా ఫీల్డింగ్ కోచ్ బాధ్యతలను నిర్వర్తించనున్నాడు. నాయర్, దిలీప్ స్థానంలో ఎవరిని నియమిస్తారన్నది తెలియరాలేదు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఓటమి తర్వత టెస్టుల్లో భారత జట్టు ప్రదర్శన విషయంలో బీసీసీఐపై ఒత్తిడి ఉన్నది. బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో ఓటమి, స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో 3-0తో ఓటమి చెందింది. ఈ క్రమంలో బీసీసీఐ భారత జట్టు ప్రదర్శనను ఎలా మెరుగుపరచాలనే కసరత్తు మొదలు పెట్టింది. మరో వైపు రెండు, సిరీస్‌లలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సరైన ఆటతీరు కనబరచకపోవడంతో విమర్శలకు గురయ్యారు. ఆస్ట్రేలియా పర్యటనలో రోహిత్ మూడు మ్యాచ్‌ల్లోని ఐదు ఇన్నింగ్స్‌లలో 6.20 సగటుతో 31 పరుగులు మాత్రమే చేయగలిగాడు. కోహ్లీ ఐదు మ్యాచ్‌ల్లో తొమ్మిది ఇన్నింగ్స్‌ల్లో 23.75 సగటుతో 190 పరుగులు చేశాడు. న్యూజిలాండ్ సిరీస్‌లోనూ ఇద్దరు ఆకట్టుకోలేకపోయారు. ఈ క్రమంలో టెస్టుల్లో టీమిండియా జట్టును బలోపేతం చేయాలని బీసీసీఐ నిర్ణయించింది.
ఐపీఎల్ ముగిసిన తర్వాత టీమిండియా ఇంగ్లాండ్‌లో పర్యటించనున్నది. ఐదు టెస్టుల సిరీస్ ఆడనున్నది. జూన్ 50 నుంచి సిరీస్ ప్రారంభమవుతుంది. మొదటి టెస్ట్ జూన్ 20 నుంచి లీడ్స్‌లో, రెండవ టెస్ట్ జూలై 2 నుంచి బర్మింగ్‌హామ్‌లో, మూడవ టెస్ట్ జూలై 10 నుంచి లండన్‌లో, నాల్గవ టెస్ట్ జూలై 23 నుంచి మాంచెస్టర్‌లో, ఐదవ టెస్ట్ జూలై 31 నుంచి కెన్నింగ్టన్ ఓవల్‌లో జరుగుతాయి. జూన్ 20 నుంచి ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు ముందు కొత్త సహాయక సిబ్బందిని నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.