న్యూఢిల్లీ : శత్రుమూకల నుంచి దేశ సరిహద్దులను కాపాడటంలోనే కాదు.. క్రీడల్లోనూ తమకు తామే సాటి అని భారత సైనికులు మరోమారు నిరూపించారు. ప్రపంచంలోనే అత్యంత కఠిన పరీక్షగా పేరొందిన ఐరన్‌మ్యాన్ ట్రయథ్లాన్‌లో బీఎస్ఎఫ్కు చెందిన హరీశ్ కజ్లా కొత్త చరిత్ర లిఖించాడు. డెన్మార్క్ రాజధాని కోపెన్‌హగన్ వేదికగా జరిగిన ఐరన్‌మ్యాన్ ట్రయథ్లాన్ ఈ 35 ఏండ్ల అధికారి అగ్రస్థానంలో నిలిచి ఔరా అనిపించాడు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి సీఏపీఎఫ్(సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్) అధికారిగా హరీశ్ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. హరీశ్ సాధించిన చిరస్మరణీయ విజయాన్ని బీఎస్ఎఫ్ తమ అధికారిక ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ‘కోపెన్‌హగన్‌లో జరిగిన ఐరన్‌మ్యాన్ ట్రయథ్లాన్‌ను విజయవంతంగా పూర్తి చేయడం ద్వారా హరీశ్..భారత భద్రతా దళాలకు మరింత విశిష్టత తీసుకొచ్చారు’అని రాసుకొచ్చింది. ట్రయథ్లాన్‌లో 3.8కి.మీల స్విమ్మింగ్, 180కి.మీల సైక్లింగ్, 42.2కి.మీల ఫుల్ మారథాన్‌ను హరీశ్ 12:42:25 టైమింగ్‌తో పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచాడు. అరుదైన ఫీట్ సాధించిన తర్వాత కజ్లా..జాతీయజెండాతో పాటు బీఎస్ఎఫ్, ఎన్ఎస్జీ జెండాలతో విజయాన్ని తనివితీరా ఆస్వాదించాడు.