న్యూఢిల్లీ: ధనాధన్‌కు మారుపేరైన టీ20ల్లో మరో రికార్డు బద్దలైంది. టీ20 ప్రపంచకప్ క్వాలిఫయింగ్‌లో భాగంగా ఈస్ట్-ఆసియా పసిఫిక్ రిజీయన్ క్వాలిఫయర్‌లో వనువాటుపై సమోవా బ్యాటర్ డేరియస్ విస్సర్(62 బంతుల్లో 132, 5ఫోర్లు, 14సిక్స్‌లు) వీర విధ్వంసం సృష్టించాడు. మంగళవారం ఏపియాలో జరిగిన టీ20 పోరులో విస్సర్..వనువాటు బౌలర్ నలిన్ నిపికోను లక్ష్యంగా చేసుకుంటూ ఒకే ఓవర్లో ఏకంగా 39 పరుగులు కొల్లగొట్టాడు. బంతిపై కక్ష్య కట్టినట్లు పిచ్‌పై పడటం ఆలస్యమన్న తరహాలో భారీ సిక్స్‌లతో హోరెత్తించాడు. నిపికో బౌలింగ్‌ను చీల్చిచెండాడుతూ విస్సర్ కొట్టిన సిక్స్‌లు మ్యాచ్‌కు హైలెట్‌గా నిలిచాయి. ఒకే ఓవర్లో విస్సర్ ఆరు బంతుల్లో ఆరు భారీ సిక్స్‌లు కొట్టగా.. మూడు నో బాల్స్ రూపేనా మూడు పరుగులు జతకలిశాయి. దీంతో అంతర్జాతీయ టీ20ల్లో ఒకే ఓవర్లో అత్యధిక పరుగుల రికార్డుతో పాటు ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌ల ఫీట్‌ను కూడా విస్సర్ తన పేరిట లిఖించుకున్నాడు.
ఈ క్రమంలో భారత దిగ్గజ ఆల్‌రౌండర్ యువరాజ్‌సింగ్‌తో పాటు కీరన్ పొలార్డ్, దీపేంద్రసింగ్ సరసన డేరియస్ నిలిచాడు. న్యూసౌత్వెల్స్(ఆస్ట్రేలియా)లోని హైప్ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందిన విస్సర్..వనువాటుపై పిడుగులా పడ్డాడు. తన కెరీర్లో మూడో టీ20 మ్యాచ్ ఆడిన విస్సర్ విజృంభణతో సమోవా నిర్ణీత 20 ఓవర్లలో174 పరుగులు చేసింది. కెప్టెన్ జస్మత్ (16)..విస్సర్ తర్వాత టాప్‌స్కోరర్‌గా నిలువగా, మిగతావారు సింగిల్ డిజిట్ స్కోర్లకు పరిమితమయ్యారు. ఆ తర్వాత లక్ష్యఛేదనలో వనవాటు 20 ఓవర్లలో 9 వికెట్లకు 164 పరుగులు చేసింది. ఓపెనర్ నిపికో(73), జోషువ రసు(23), టిమ్ కట్లర్(21) రాణించినా 10 పరుగుల తేడాతో ఓటమివైపు నిలిచారు. ధనాధన్ ఇన్నింగ్స్‌తో జట్టు విజయంలో కీలకమైన విస్సర్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.