మహిళల క్రికెట్లో నవ శకానికి నాంది పడింది. పురుషుల క్రికెట్లో సంచలనాత్మక మార్పులకు తెరలేపిన ఐపీఎల్ తరహాలో.. మహిళల కోసం ప్రత్యేకంగా నిర్వహించనున్న ప్రీమియర్ లీగ్ తొలి వేలంలో అమ్మాయిలు అదిరిపోయే ధర దక్కించుకున్నారు. టీమ్ ఇండియా స్టార్ ఓపెనర్ స్మృతి మందన (ఆర్సీబీ) అత్యధికంగా 3.4 కోట్లు కొల్లగొట్టగా.. అంతర్జాతీయ స్టార్లు నటాలియా స్కీవర్ (ముంబై), ఆష్లే గార్డ్నర్ (గుజరాత్) చెరో 3.2 కోట్లు దక్కించుకున్నారు. ఫ్రాంచైజీలన్నీ ఆల్‌రౌండర్ల కోసం పోటీపడగా.. దీప్తి శర్మను రూ. 2.6 కోట్లకు యూపీ జట్టు చేజిక్కించుకుంది. ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై అజేయ అర్ధశతకం బాదిన జెమీమా రోడ్రిగ్స్ (ఢిల్లీ)కు అనూహ్యంగా 2.2 కోట్లు దక్కగా.. భారత కెప్టెన్‌ను హర్మన్‌ప్రీత్ కౌర్‌ను రూ. 1.8 కోట్లకు ముంబై ఇండియన్స్ కైవసం చేసుకుంది.
ముంబై: భారత స్టార్ ఓపెనర్ స్మృతి మందన మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో జాక్‌పాట్ కొట్టింది. డబ్ల్యూపీఎల్ వేలంలో స్మృతికి భారీ ధర పలికింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఈ ఓపెనర్ కోసం రూ. 3.40 కోట్లు వెచ్చించింది. స్మృతి కోసం పలు ఫ్రాంచైజీలు పోటీపడగా.. చివరకు ఆర్సీబీ దక్కించుకుంది. మహిళల క్రికెట్ రూపురేఖలు మార్చే సత్తా ఉన్న డబ్ల్యూపీఎల్ కోసం సోమవారం ముంబై వేదికగా వేలం జరుగగా.. మొత్తం ఐదు ఫ్రాంచైజీలు 87 మంది ప్లేయర్లను ఎంపిక చేసుకున్నాయి. ఫ్రాంచైజీలన్నీ భారత ప్లేయర్లను దక్కించుకునేందుకు ఎక్కువ పోటీపడగా.. విదేశీ ప్లేయర్లలో ఆష్ల్లే గార్డ్నర్, నటాలియా స్కీవర్‌కు భారీ ధర దక్కింది.
ముంబై ఇండియన్స్ జట్టు స్కీవర్ కోసం రూ. 3.20 కోట్లు వెచ్చించింది. ఈ వేలంలో 10 మంది భారత ప్లేయర్లు కోటి రూపాయల మార్క్ దాటారు. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌ను రూ.1.80 కోట్లకు ముంబై ఇండియన్స్ దక్కించుకోగా.. వరల్డ్‌కప్‌లో దాయాది పాకిస్థాన్‌పై దంచికొట్టిన జెమీమా రోడ్రిగ్స్ పంట పండింది. రోడ్రిగ్స్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 2.20 కోట్లు వెచ్చించింది. యువ ఓపెనర్, అండర్-19 ప్రపంచకప్ విజేత షఫాలీ వర్మను రూ. 2 కోట్లకు ఢిల్లీ కొనుగోలు చేసుకుంది.
ఇక స్పిన్ ఆల్‌రౌండర్ దీప్తిశర్మ కోసం ఫ్రాంచైజీలన్నీ పోటీపడగా.. చివరకు యూపీ వారియర్స్ ఆమెను 2.6 కోట్లకు దక్కించుకుంది. టీమ్ఇండియా ప్లేయర్లలో ఇది రెండో అత్యధికం. ఆల్‌రౌండర్ పూజ వస్ర్తాకర్ను ముంబై రూ.1.90 కోట్లకు కొనుగోలు చేయగా.. వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ కోసం బెంగళూరు అంతే మొత్తాన్ని వెచ్చించింది. యష్తిక భాటియా (ముంబై ఇండియన్స్)కు రూ. 1.5 కోట్లు దక్కగా.. పేస్ బౌలర్ రేణుక సింగ్‌ను రూ. 1.5 కోట్లకు బెంగళూరు సొంతం చేసుకుంది. ఇటీవల దక్షిణాఫ్రికాలో జరిగిన అండర్-19 టీ20 ప్రపంచకప్‌లో రాణించిన తెలంగాణ యువకెరటం త్రిషకు డబ్ల్యూపీఎల్ వేలంలో చుక్కెదురైంది. మరోవైపు మన అమ్మాయిలు అరుంధతి రెడ్డి (ఢిల్లీ క్యాపిటల్స్), యశశ్రీ (యూపీ వారియర్స్)వేలంలో అమ్ముడుపోయారు.
గతంలో పురుషుల ఐపీఎల్ వేలం టీవీల్లో చూసేవాళ్లం. అలాంటిది అమ్మాయిల కోసం వేలం నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. ఆర్సీబీ ఫ్రాంచైజీ నన్ను ఎంపిక చేసుకోవడం సంతోషకరం. అతిపెద్ద ఫ్యాన్ బేస్ ఉన్న ఆర్సీబీతో జతకట్టేందుకు ఉత్సాహంగా ఉన్నా.
– స్మృతి మందన
స్మృతి : 3.40 కోట్లు
జెమీమా రోడ్రిగ్స్ : 2.20 కోట్లు
అరుంధతి రెడ్డి : 30 లక్షలు
యశశ్రీ : 10లక్షలు
హర్మన్‌ప్రీత్ కౌర్ : 1.80 కోట్లు
ఆష్లే గార్డ్నర్ : 3.20 కోట్లు
దీప్తి శర్మ : 2.60 కోట్లు
కోటీశ్వరులు వీళ్లే..
స్మృతి మందన (ఆర్సీబీ) : 3.4
నటాలియా స్కీవర్ (ముంబై) : 3.2
ఆష్లే గార్డ్నర్ (గుజరాత్) : 3.2
దీప్తి శర్మ (యూపీ) : 2.6
జెమీమా రోడ్రిగ్స్ (ఢిల్లీ) : 2.2
బెత్ మూనీ (గుజరాత్) : 2.0
షఫాలీ వర్మ (ఢిల్లీ) : 2.0
పూజ వస్ర్తాకర్ (ముంబై) : 1.9
రిచా ఘోష్ (ఆర్సీబీ) : 1.9
సోఫీ ఎకెల్‌స్టోన్ (యూపీ) : 1.8
హర్మన్‌ప్రీత్ (ముంబై) : 1.8
ఎలిసా పెర్రీ (ఆర్సీబీ) : 1.7
రేణుకా సింగ్ (ఆర్సీబీ) : 1.5
యష్తిక భాటియా (ముంబై) : 1.5
తలిహా మెక్‌గ్రాత్ (యూపీ) : 1.4
మెగ్ లానింగ్ (ఢిల్లీ) : 1.1
షబ్నమ్ ఇస్మాయిల్ (యూపీ) : 1.0
అమేలియా కెర్ (ముంబై) : 1.0
భారత టాప్-5
స్మృతి మందన (ఆర్సీబీ) : 3.4
దీప్తి శర్మ (యూపీ) : 2.6
జెమీమా రోడ్రిగ్స్ (ఢిల్లీ) : 2.2
షఫాలీ వర్మ (ఢిల్లీ) : 2.0
పూజ వస్ర్తాకర్ (ముంబై) : 1.9
రిచా ఘోష్ (ఆర్సీబీ) : 1.9
నోట్: రూ. కోట్లలో