హైదరాబాద్, ఆట ప్రతినిధి: విశాఖపట్నం వేదికగా జరుగుతున్న అండర్-19 మహిళల జాతీయ టీ20 టోర్నీలో రాష్ట్ర యువ ప్లేయర్ జీ త్రిష పరుగుల వరద పారిస్తున్నది. మంగళవారం భారత్ ‘ఎ’తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ‘బి’ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. భారత్ ‘ఎ’ నిర్దేశించిన 117 పరుగుల లక్ష్యాన్ని భారత్ ‘బి’ 17.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది. భారత్ ‘బి’ తరఫున త్రిష(39 బంతుల్లో 58 నాటౌట్, 8ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ అర్ధసెంచరీతో అదరగొట్టింది. ఓవరాల్‌గా టోర్నీలో ఇప్పటి వరకు రెండు మ్యాచ్‌లాడిన త్రిష 107 పరుగులతో టాప్‌లో కొనసాగుతున్నది. తొలుత భారత్ ‘ఎ’ 20 ఓవర్లలో 116/8 స్కోరు చేసింది.