హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): గచ్చిబౌలి స్టేడియం వేదికగా బుధవారం 74వ బీఎన్ మల్లిక్ అఖిల భారత పోలీస్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ అట్టహాసంగా మొదలైంది. రాష్ట్ర గవర్నర్ శివ్‌ప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరై టోర్నీని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ‘క్రీడలు కేవలం శారీరక ధృడత్వానికి కాకుండా వ్యక్తిత్వ వికాసానికి, క్రమశిక్షణకు, పోలీస్ విధులకు ప్రాణాధారం.
దేశం నలమూలల నుంచి వచ్చిన పోలీస్ సిబ్బంది..తమ యూనిఫామ్‌ను పక్కకు పెట్టి, జెర్సీల్లో ఆరోగ్యకరమైన పోటీ కోసం ఒక చోట చేరడం అసాధారణమైన విషయం. భవిష్యత్‌లో ఈ పోటీల్లో మహిళా పోలీసుల భాగస్వామ్యం పెరగాలి. యంగ్‌ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ వంటి కొత్త కార్యక్రమాలతో రాష్ట్రం ప్రపంచస్థాయి అథ్లెట్లకు కేంద్రం కానుంది’ అని అన్నారు.
ఈ కార్యక్రమంలో భారత మాజీ ఫుట్‌బాల్ కెప్టెన్ విక్టర్ అమల్‌రాజ్, స్టార్ ప్లేయర్ గుగులోతు సౌమ్య, డీజీపీ శివధర్‌రెడ్డి, పోలీస్ అకాడమీ డైరెక్టర్లు అభిలాష బిస్త్, అడిషనల్ డీజీపీలు సంజయ్‌కుమార్, అనిల్‌కుమార్, ఐజీ గజరావు భూపాల్, సైబరాబాద్ సీపీ రమేశ్, డీఐజీ అభిషేక్ మహంతి పాల్గొన్నారు.