లండన్: పాకిస్థాన్ మెన్స్, వుమెన్స్ క్రికెటర్ల(Pakistan Cricketers)కు తీవ్ర అవమానం జరిగింది. ఇంగ్లండ్‌లో జరగనున్న ద హండ్రెడ్ టోర్నీకి.. ఆ దేశానికి చెందిన ప్లేయర్లు ఎంపిక కాలేదు. 8 ప్రాంచైజీలు పాక్ క్రికెటర్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి ప్రదర్శించలేదు. ఆగస్టు 5 నుంచి 31 వరకు జరిగే ఈ టోర్నీ కోసం ఫ్రాంచైజీలు ఆటగాళ్ల డ్రాఫ్ట్‌ను రూపొందించాయి. అయితే 45 మంది పురుష క్రికెటర్లు, 5 మంది మహిళా క్రికెటర్లను ఎంపిక చేసుకునేందుకు ఫ్రాంచైజీలు ఇష్టపడలేదు. ఇమాద్ వసీమ్, హసన్ అలీ, సౌద్ షకీల్, సల్మాన్ అలీ ఆఘా, నసీమ్ షా, మొహమ్మద్ ఆమిర్ లాంటి క్రికెటర్లను కూడా ఫ్రాంచైజీలు పట్టించుకోలేదు. ఓవర్సీస్ కోటాలో వాళ్లను తీసుకునేందుకు ఫ్రాంచైజీలు ముందుకు రాలేదు.
ద హండ్రెడ్ టోర్నీలో 270 మంది దేశీయ, 350 మంది విదేశీ క్రికెటర్లు ఆడేందుకు అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం తయారు చేసిన డ్రాఫ్ట్‌లో పాక్ క్రికెటర్లకు ఛాన్స్ రాలేదు. కానీ మే నెలలో వైల్డ్ కార్డు ఎంట్రీ ఉంటుంది. ఒకవేళ ఆ సమయంలో పాక్ ప్లేయర్లకు అవకాశం దక్కుతుందని భావిస్తున్నారు. వాస్తవానికి ఈ సారి ద హండ్రెడ్ టోర్నీలో.. నాలుగు జట్లకు .. ఐపీఎల్ ఫ్రాంచైజీలే భాగస్వాములుగా ఉన్నారు. ఓవల్ ఇన్విన్సిబుల్స్లో ముంబై ఇండియన్స్, మాంచెస్టర్ ఒరిజినల్స్‌లో లక్నో సూపర్ గెయింట్స్, వెల్ష్ ఫైర్‌లో సంజయ్ గోయల్, నార్త్నర్ సూపర్ఛార్జర్స్లో సన్ గ్రూపు పెట్టుబడులు పెట్టాయి. వీరితో పాటు భారతీయ సంతతి వ్యక్తులు మిగితా ఆరు టీమ్‌ల్లో ఇన్వెస్ట్ చేశారు.
దక్షిణాఫ్రికా నిర్వహించే టీ20 లీగ్‌లో కూడా ఐపీఎల్ ఫ్రాంచైజీలకు వాటాలు ఉన్నాయి. దీంతో ఆ టోర్నీకి కూడా పాక్ క్రికెటర్లను ఎంపిక చేయలేదు. ద హండ్రెడ్ టోర్నీకి జేమ్స్ ఆండర్సన్ వేలంలో ఉన్నా.. అతన్ని ఏ జట్టు కూడా సొంతం చేసుకోలేదు. ఇక ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ కుమారుడు 16 ఏళ్ల జేమ్స్ అండర్సన్‌ను కూడా ఫ్రాంచైజీలు కొనుగోలు చేయలేదు.