హైదరాబాద్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీలో 42వ జాతీయ పోలీస్ గుర్రపు స్వారీ చాంపియన్ షిప్ పోటీలు మంగళవారం ప్రారంభమయ్యాయి. సర్దార్ పటేల్ పోలీసు అకాడమీ డైరెక్టర్ జనరల్ అనురాగ్ గార్గ్ పోటీలను ప్రారంభించారు. జనవరి 5వ తేదీ వరకు చాంపియన్ షిప్ కొనసాగనున్నది.
ఇందులో 610 మంది జాకీలు పాల్గొంటున్నారు. వివిధ రాష్ట్ర పోలీసు బలగాలు, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీ మరియు సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్స్) నుంచి 340 గుర్రాలు పోటీల్లో ఉన్నాయి. 1970వ సంవత్సరం నుంచి ప్రతి ఏటా ఆల్ ఇండియా పోలీస్ హార్స్ షో పోటీలను నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లో ఈ పోటీలు జరగడం ఇది 16వ సారి కావడం విశేషం. మంగళవారం 30 గుర్రాలు పోటీలో పాల్గొన్నాయి. జనవరి 5న ముగింపు వేడుక నిర్వహించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు.