లండన్ : సీజన్ మూడో గ్రాండ్‌స్లామ్ అయిన ప్రతిష్టాత్మక వింబుల్డన్ టోర్నీకి వేళైంది. జూన్ 30 నుంచి మొదలుకానున్న ఈ మెగా టోర్నీ.. రెండు వారాల పాటు (జులై 13 దాకా) టెన్నిస్ అభిమానులను అలరించేందుకు సిద్ధమైంది. టెన్నిస్‌లో అత్యంత పురాతనమైన వింబుల్డన్‌లో తొలిసారిగా.. లైన్ జడ్జీలు లేకుండా టోర్నీని నిర్వహించనుండటం విశేషం. ఏకంగా 450 ట్రాకింగ్ కెమెరాల సాయంతో వాటిని పర్యవేక్షించనున్నారు. 138వ ఎడిషన్‌గా జరుగనున్న ఈ మెగా టోర్నీని వరుసగా మూడోసారి (పురుషుల సింగిల్స్‌లో) గెలుచుకుని హ్యాట్రిక్ సాధించాలని స్పెయిన్ కుర్రాడు కార్లొస్ అల్కరాజ్ భావిస్తుండగా.. ఇటీవలే ముగిసిన ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని యానిక్ సిన్నర్ (ఇటలీ), కెరీర్లో 25వ టైటిల్ కలను నెరవేర్చుకునేందుకు గాను నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) బరిలోకి దిగనున్నారు. మహిళల సింగిల్స్‌లోనూ 2016లో సెరీనా విలియమ్స్ తర్వాత ఇక్కడ టైటిల్ నిలబెట్టుకున్న ప్లేయర్ మరొకరు లేరు. గత సీజన్లో క్రెజికోవా విజేతగా నిలువగా ప్రస్తుతం మహిళల టెన్నిస్‌లో రారాణులుగా వెలుగొందుతున్న సబలెంక, స్వియాటెక్, గాఫ్లో ఎవరు విజేతగా నిలుస్తారనేది ఆసక్తికరం.
22 ఏండ్ల వయసులోనే ఏకంగా 5 గ్రాండ్‌స్లామ్‌లు గెలుచుకుని రఫెల్ నాదల్ వారసుడిగా గుర్తింపు దక్కించుకున్న అల్కరాజ్.. 2023, 2024 సీజన్లలో వింబుల్డన్ విజేతగా నిలిచాడు. రెండుసార్లూ ప్రత్యర్థి జొకోవిచే కావడం గమనార్హం. 2025లోనూ ట్రోఫీని ముద్దాడి హ్యాట్రిక్ కొట్టాలనే ప్రణాళికతో అతడు ఈ టోర్నీలో అడుగుపెట్టాడు. రెండో సీడ్‌గా బరిలోకి దిగుతున్న ఈ నయా స్పెయిన్ బుల్.. ఫైనల్ చేరడం పెద్ద కష్టమేమీ కాదు. తొలి రౌండ్లో క్వాలిఫయర్ ఫాబియో ఫోగ్నినితో తలపడనున్న అతడు.. ఫైనల్ దాకా జొకోవిచ్, సిన్నర్, జేక్ డ్రాపర్ వంటి స్టార్ ప్లేయర్లతో తలపడే అవకాశం లేదు. క్వార్టర్స్‌లో అతడు.. ముసెట్టి లేదా రూనెలలో ఎవరో ఒకరితే ఆడే అవకాశముంది. ఇటలీ కుర్రాడు సిన్నర్.. జొకోవిచ్‌తో మరోసారి సెమీస్ ఆడే అవకాశాలు లేకపోలేదు. ఫ్రెంచ్ ఓపెన్‌లో ఓటమితో కుంగిపోయిన సిన్నర్.. వింబుల్డన్‌లో సత్తాచాటాలని పట్టుదలగా ఉన్నాడు. ఇక ఏడుసార్లు వింబుల్డన్ విజేతగా నిలిచిన జొకో.. 2022 తర్వాత ఇక్కడ ట్రోఫీ గెలవలేదు. గత రెండు సీజన్లలో అతడి టైటిల్ ఆశలపై అల్కరాజ్ నీళ్లుచల్లాడు. కెరీర్ చరమాంకంలో ఉన్న జొకోకు ఇక్కడ ఏకంగా ఏడు టైటిల్స్ గెలిచిన అనుభవముంది. మరి ఇక్కడైనా ఈ సెర్బియా దిగ్గజం కల నెరవేరుతుందో? లేదో? చూడాలి.
మహిళల సింగిల్స్‌లో సబలెంక, స్వియాటెక్, గాఫ్‌తో పాటు మాడిసన్ కీస్, జెస్సికా పెగుల, జాస్మిన్ పౌలోని, జెంగ్ కిన్వెన్, ఎలీనా రిబాకినా ఫేవరెట్లుగా ఉన్నారు. పైన పేర్కొన్నవారిలో రిబాకినా మినహా మిగిలినవారెవరూ వాళ్ల కెరీర్లో ఒక్కసారి కూడా వింబుల్డన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకోలేదు. 2024లో పౌలోని.. ఫైనల్లో క్రెజికోవా చేతిలో ఓటమిపాలైంది.