ఢిల్లీ: భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలతో వారం రోజుల పాటు వాయిదాపడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ను పున:ప్రారంభించాలనే సంకల్పంతో ఉన్న భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ).. ఈనెల 16 నుంచి లీగ్‌ను తిరిగి ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నది. దాయాది దేశాలు కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటించిన తర్వాత తాజా సీజన్‌ను వీలైనంత త్వరగా పూర్తిచేయాలనే పట్టుదలతో ఉన్న బీసీసీఐ.. ఈ మేరకు ఆదివారం ఢిల్లీలో ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులతో సమావేశమైంది. బోర్డు వర్గాల సమాచారం ప్రకారం ఈనెల 16 లేదా 17న లీగ్‌ను తిరిగి ఆరంభించాలని యోచిస్తున్నది.
మే 9న లక్నో-బెంగళూరు మ్యాచ్‌కు ముందు వాయిదాపడ్డ ఐపీఎల్-18ను మళ్లీ అదే మ్యాచ్‌తో మొదలుపెట్టనున్నట్టు తెలుస్తున్నది. అలాగే ఫైనల్ వేదికను ఈడెన్ గార్డెన్స్ (కోల్‌కతా) నుంచి అహ్మదాబాద్‌కు మార్చనున్నట్టు సమాచారం. ఎట్టిపరిస్థితుల్లోనూ మే 30 లేదా జూన్ 1 నాటికి ఈ సీజన్‌ను పూర్తిచేయాలని బీసీసీఐ భావిస్తున్నట్టు బోర్డు వర్గాలు తెలిపాయి. కొత్త షెడ్యూల్, వేదికలకు సంబంధించిన వివరాలను సోమవారం ప్రకటించే అవకాశముంది.
ఆదివారం సమావేశం ముగిసిన తర్వాత బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా మాట్లాడుతూ.. ‘బీసీసీఐ సెక్రటరీ, ఐపీఎల్ చైర్మన్ ఫ్రాంచైజీలతో మాట్లాడుతున్నారు. ఐపీఎల్ పునరుద్ధరణకు సంబంధించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం’ అని అన్నారు. లీగ్ వాయిదాతో పలువురు విదేశీ ఆటగాళ్లు తమ స్వస్థలాలకు పయనమైన నేపథ్యంలో ఫ్రాంచైజీలన్నీ వారిని ఒప్పించి మంగళవారం (మే 13) నాటికి వారి హోంగ్రౌండ్‌కు వచ్చేలా చూసుకోవాలని ఆయా జట్లకు బీసీసీఐ సూచించినట్టు బోర్డు ప్రతినిధి ఒకరు తెలిపారు.
వేదికలకు సంబంధించి.. ప్లేఆఫ్స్ షెడ్యూల్లో ఫైనల్ మ్యాచ్‌కు మినహా హైదరాబాద్‌లో జరగాల్సిన క్వాలిఫయర్, ఎలిమినేటర్ యథావిధిగా జరుగనుంది. ఒకవేళ మే 30 లేదా జూన్ 1న ఫైనల్‌ను నిర్వహిస్తే అదే సమయానికి కోల్‌కతాలో వర్షం పడే అవకాశాలు మెండుగా ఉన్న నేపథ్యంలో తుదిపోరును అహ్మదాబాద్‌లో ఆడించనున్నట్టు సమాచారం.