సుమారు మూడు వారాలుగా ప్రపంచ క్రీడాభిమానులను ఉర్రూతలూగించిన పారిస్ ఒలింపిక్స్‌కు తెరపడింది. సరిగ్గా వందేండ్ల తర్వాత విశ్వక్రీడాపండుగకు ఆతిథ్యమిచ్చిన ఫ్యాషన్ నగరిలో జూలై 25న ప్రఖ్యాత సీన్ నదిలో ఆరంభమైన ఈ క్రీడలకు ఆదివారంతో శుభం కార్డు పడింది. పదివేలకు పైగా అథ్లెట్లు, 32 క్రీడలు, 329 క్రీడాంశాలతో 17 రోజుల పాటు క్రీడా ప్రపంచాన్ని మునివేళ్లపై కూర్చోబెట్టిన ఆటలు ఘనంగా ముగిశాయి. పతకాల పట్టికలో అగ్రస్థానం కోసం ఎప్పటిలాగే అమెరికా, చైనా ‘టాప్’ లేపగా పలు దేశాలు బోణీ కూడా కొట్టకుండానే రిక్తహస్తాలతో వెనుదిరిగాయి. 117 మంది భారీ బృందంతో పారిస్‌కు వెళ్లిన భారత్ ఈసారి ‘రెండంకెల పతకాల’ కలను నెరవేర్చుకోకుండానే స్వదేశానికి తిరుగు ప్రయాణమైంది. ఇక ఒలింపిక్స్‌లో తర్వాతి గమ్యస్థానం లాస్ ఏంజెల్స్. 2028లో ఈ నగరం విశ్వక్రీడలకు ఆతిథ్యమివ్వనుంది.
Paris Olympics | పారిస్: ఫ్యాషన్ నగరి పారిస్‌లో మూడు వారాలుగా క్రీడా లోకాన్ని అలరించిన విశ్వక్రీడా పండుగకు తెరపడింది. ఒలింపిక్స్ చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా స్టేడియం లోపల కాకుండా ప్రఖ్యాత సీన్ నదిలో ఆరంభ వేడుకలతో మొదలైన ఈ క్రీడలు ఆదివారంతో ముగిశాయి. ఎన్నో సంచలనాలు, మరెన్నో అబ్బురపరిచే ప్రదర్శనలు, కొత్తగా నమోదైన రికార్డులు, త్రుటిలో చేజారిన పతకాలు, క్రీడాకారుల నాలుగేండ్ల కఠోర శ్రమకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచిన పారిస్.. ఆటలకు ఘనంగా వీడ్కోలు పలికింది. ఐరాస గుర్తించిన దేశాలన్నింటితో పాటు ఒలింపిక్ శరణార్థుల జట్టు (ఐవోసీ) నుంచి పాల్గొన్న 10,500 మంది క్రీడాకారులు తమ అత్యుత్తమ ప్రదర్శనలతో అభిమానులకు అసలైన మజాను అందించారు. ఆతిథ్య పారిస్‌లోని ‘ఒలింపిక్ గ్రామం’లో వసతుల లేమి, సీన్ నదిలో ఆరంభ వేడుకలు, అక్కడి నీటి నాణ్యతపై అపోహలు, పోటీల ఆరంభానికి ముందే అల్లరి మూకల బెదిరింపు చేష్టలు, బరిలో నిలిచిన పలువురు అథ్లెట్ల ‘జెండర్’పై వివాదం, భారత రెజ్లర్ వినేశ్ ఫోగాట్‌పై అనర్హత వేటు వంటి చర్చోపచర్చలకు ఒలింపిక్స్ కేంద్ర బింధువైంది. విజ్ఞాలన్నింటినీ దాటుకుని సాగిన పారిస్ ప్రయాణానికి ఆదివారంతో శుభం కార్డు పడింది. తదుపరి ఎడిషన్‌కు లాస్ ఏంజెల్స్ (అమెరికా) ఆతిథ్యమివ్వనుంది.
ఉందిలే మంచికాలం ముందుముందున!
పారిస్‌లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన భారత్ మరోసారి ఆరు పతకాలతో ‘సింగిల్ డిజిట్’కే పరిమితమైంది. అయితే ఆశించిన మెడల్స్ రాకున్నా మన క్రీడాకారుల ఆట మునపటి కంటే బాగా మెరుగుపడింది. షూటింగ్లో యువ సంచలనం మను భాకర్ ఒకే ఎడిషన్‌లో రెండు పతకాలు కొల్లగొట్టి చరిత్రాత్మక ప్రదర్శన చేసింది. సరభ్‌జ్యోత్ సింగ్, స్వప్నీల్ కుశాలె, అర్జున్ బబుతా వంటి యువ షూటర్లు భవిష్యత్‌పై ఆశలు రేపుతున్నారు. పతకాలు రాకున్నా ఆర్చరీలో మన విలుకాళ్లు గతం కంటే మెరుగైన ప్రదర్శనే కనబరిచారు. బ్యాడ్మింటన్, ఆర్చరీ, షూటింగ్, అథ్లెటిక్స్ వంటి పలు క్రీడాంశాల్లో భారత్ నాలుగో స్థానంలో నిలిచి మరో ఏడు పతకాలు సాధించే అవకాశాన్ని కోల్పోయింది.
అవీ వచ్చుంటే పారిస్‌లో మన లక్ష్యం నెరవేరేదే! టేబుల్ టెన్నిస్‌లో ప్యాడ్లర్లు మనికా బాత్ర, హైదరాబాదీ అమ్మాయి ఆకుల శ్రీజ సైతం ఫర్వాలేదనిపించారు. ఇక నీరజ్ మరో స్వర్ణం తేకున్నా రజతంతో రికార్డులు సృష్టించాడు. హాకీలో వరుసగా రెండోసారి కాంస్యం గెలుచుకున్న భారత జట్టు ఒలింపిక్స్‌లో 52 ఏండ్ల తర్వాత ఆస్ట్రేలియాను ఓడించడం విశేషం. బాక్సింగ్, అథ్లెటిక్స్‌లో మాత్రం దేశానికి నిరాశజనక ప్రదర్శనలు వచ్చాయి. రెజ్లింగ్‌లో వినేశ్ ఫోగాట్ ‘వంద గ్రాముల’ బరువు దేశ క్రీడాభిమానులకు కలిచివేయగా యువ రెజ్లర్ అమన్ సెహ్రావత్ మాత్రం ‘పట్టు’ వీడలేదు.
మళ్లీ వాళ్లే..
గత కొన్నేండ్లుగా ప్రపంచంపై ఆధిపత్యం కోసం అమెరికాతో ఢీ అంటే ఢీ అంటున్న చైనా ఒలింపిక్స్‌లోనూ ఆ దేశానికి అసలు సిసలు పోటీనిచ్చింది. ఈ రెండు దేశాలూ అగ్రస్థానం కోసం చెమటోడ్చాయి. తలా 40 స్వర్ణాలతో సత్తా చాటినా మొత్తంగా అమెరికాకు 126 పతకాలు రాగా చైనా 91 పతకాల వద్దే ఆగిపోయింది. టేబుల్ టెన్నిస్, జిమ్నాస్టిక్స్, డైవింగ్, షూటింగ్ వంటి క్రీడాంశాల్లో చైనా దూకుడు చూపించగా అథ్లెటిక్స్, స్విమ్మింగ్, జిమ్నాస్టిక్స్, రెజ్లింగ్‌లో అమెరికా ఆధిక్యంలో నిలిచింది. ఆతిథ్య ఫ్రాన్స్ 53 పతకాలతో ఐదో స్థానంలో నిలిచింది. ఆరు పతకాలు వచ్చినా స్వర్ణం లేకపోవడంతో భారత్ 71వ స్థానంతో ముగించింది.