Coco Gauff : అమెరికన్ టెన్నిస్ సంచలనం, వరల్డ్ నంబర్ 7 కొకొ గాఫ్ కెరీర్లో మూడో సింగిల్ టైటిల్ సాధించింది. న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో జరిగిన ఏఎస్‌బీ క్లాసిక్ సింగిల్స్ ఫైనల్లో 18 ఏళ్ల గాఫ్ విజేతగా నిలిచింది. టాప్ సీడ్‌గా బరిలోకి దిగిన ఈ యువ క్రీడాకారిణి ఆదివారం జరిగిన ఫైనల్లో స్పెయిన్‌కు చెందిన రెబెకాను ఓడించింది.130 ర్యాంకర్ అయిన రెబెకాను వరుస సెట్లలో 6-1, 6-1తో చిత్తు చేసింది. వర్షం కారణంగా ఫైనల్ మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. గాఫ్ 5-1 ఆధిక్యంలో ఉండగా మళ్లీ చినుకులు పడడంతో మ్యాచ్‌ను కాసేపు నిలిపివేశారు. రెండో సెట్లో రెబెకా ఐదు బ్రేక్ పాయింట్లు సాధించింది. అయినా కూడా గాఫ్ పట్టు విడువకుండా పోరాడి టైటిల్ దక్కించుకుంది.
ఆ టోర్నమెంట్లో ఐదు మ్యాచ్‌లు ఆడిన గాఫ్ ఒక్క సెట్ కూడా కోల్పోలేదు. గాఫ్ రెండేళ్ల క్రితం ఎమిలియా రోమగ్నా ఓపెన్ టైటిల్ గెలిచింది. గాఫ్ పోయిన ఏడాది డబుల్స్‌లో నంబర్ 1 ర్యాంకుకు సింగిల్స్‌లో కెరీర్ బెస్ట్ ర్యాంక్ 4వ ర్యాంకు సాధించింది. 2018లో గాఫ్ టెన్నిస్‌లో ఆరంగ్రేటం చేసింది.