Noah Lyles | ఈ భూగోళంపై అత్యంత వేగంగా పరిగెత్తే అథ్లెట్ ఎవరో తేలిపోయింది. ఒలింపిక్స్ అనగానే వెంటనే గుర్తుకు వచ్చే 100మీటర్ల స్ప్రింట్‌లో నయా చాంపియన్ దూసుకొచ్చాడు. గత కొన్నేండ్లుగా ఈ విభాగాన్ని అపత్రిహతంగా ఏలుతున్న జమైకా ఆధిపత్యానికి చెక్ పెడుతూ అమెరికా సంచలనం నోవా లైల్స్ అదిరిపోయే ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఆదివారం అర్ధరాత్రి(భారత కాలమానం ప్రకారం) జరిగిన పురుషుల 100మీటర్ల రేసును లైల్స్ 9.79సెకన్లలో ముగించి పసిడి పతకాన్ని సొంతం చేసుకోగా, కిషాన్ థామస్(9.79, జమైకా), కెర్లె(9.81, అమెరికా) వరుసగా రజత, కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు.
అసలు మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన లైల్స్..హాట్ ఫెవరేట్లు అనుకున్న థామస్, జాకబ్స్(ఇటలీ)కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు. గన్ నుంచి వదిలిన బుల్లెట్‌ను తలపిస్తూ ఎనిమిది మంది స్ప్రింటర్లు పరుగు లంఘించారు. దాదాపు ప్రతీ దశలో ఒకే రీతిలో పరిగెత్తిన అథ్లెట్లు గమ్యాన్ని చేరుకునే క్రమంలో ఒకింత తడబడ్డారు. సమయం పరంగా థామస్‌తో సమంగా నిలిచిన లైల్స్ సెకనులో ఐదువేల వంతు తేడాతో పసిడి పతకాన్ని ముద్దాడాడు. వాస్తవానికి జమైకా స్ప్రింటర్ ఒబ్లిక్ సెవిల్లె(9.91సె) నోవాకు పోటీనిస్తాడని భావించినా..ఆఖరి స్థానంతో నిరాశపరిచాడు.