దోహా: ప్రతిష్టాత్మక టేబుల్ టెన్నిస్(టీటీ) ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత నంబర్‌వన్ ప్యాడ్లర్ ఆకుల శ్రీజకు నిరాశ ఎదురైంది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి పోరులో శ్రీజ 11-9, 8-11, 6-11, 5-11, 2-11తో సుతాసిని సావెట్ట(థాయ్‌లాండ్) చేతిలో ఓటమిపాలైంది. ఆసక్తికరంగా సాగిన పోరులో తొలి గేమ్‌ను కైవసం చేసుకున్న శ్రీజ…అనవసర తప్పిదాలతో ప్రత్యర్థికి పాయింట్లు ఇచ్చుకుని వరుస గేమ్‌లు కోల్పోయి 33 నిమిషాల్లోనే తన పోరాటాన్ని ముగించింది.
ఇదిలా ఉంటే మహిళల డబుల్స్‌లో భారత ద్వయం ఐహిక, సుతీర్థ ముఖర్జీ 4-11, 11-9, 10-12, 11-9, 11-7తో టర్కీ జోడీ ఒజె యిల్మాజ్, ఎకె హరాక్పై గెలిచి ముందంజ వేసింది. మరో పోరులో దియా చితాలె, యశస్విని జంట 9-11, 11-2, 11-9, 11-8తో ఉజ్బెకిస్థాన్ ద్వయం మాగ్దీవా, ఎర్బకెవాపై గెలిచి రెండో రౌండ్లోకి ప్రవేశించింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో మానవ్ థక్కర్, మానుశ్ షా ద్వయం 11-7, 11-8, 11-6తో స్లోవెకియా జంట డెనీ కుజోల్, పీటర్ హ్రిబర్పై గెలిచి శుభారంభం చేసింది.