న్యూఢిల్లీ: అనూహ్య పరిణామాల మధ్య టీమ్ఇండియా వన్డే జట్టు పగ్గాలు అందుకున్న రోహిత్ శర్మ తొలి పరీక్షలో ఆకట్టుకున్నాడని లిటిల్ మాస్టర్ సునిల్ గవాస్కర్ పేర్కొన్నాడు. వెస్టిండీస్‌తో తొలి వన్డేలో రోహిత్ ఫీల్డింగ్ సెట్ చేసిన విధానం.. పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం.. ఆపై బ్యాటింగ్‌లోనూ హాఫ్‌సెంచరీతో మెరవడం శుభపరిణామం అని సన్నీ అన్నాడు. ‘రోహిత్ కెప్టెన్సీకి 10కి 9.99 రేటింగ్ ఇస్తా. అతడి బుర్ర నన్ను ఆకట్టుకున్నది. పొలార్డ్ టాస్ ఓడిపోవడం నుంచి తొలి వన్డేలో రోహిత్‌కు అన్నీ అనుకూలించాయి. మైదానంలో తన నిర్ణయాలతో పాటు బ్యాటింగ్‌లోనూ అర్ధశతకం బాదడం అతడి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే విషయం’ అని సన్నీ అన్నాడు. ఇక రోహిత్, కోహ్లీ మధ్య విభేదాలపై స్పంది స్తూ.. ‘అవన్నీ ఊహాగానాలే. మీడియా పుట్టించిన వదంతులు మాత్రమే. వారి మధ్య చక్కటి అవగాహన ఉంది. ఆదివారం పోరులో డీఆర్ఎస్ తీసుకునే విషయంలోనూ ఇది స్పష్టమైంది’అని సన్నీ వివరించాడు.