నా అదృష్టం యాషెస్ సిరీస్‌లో తెలుగు వ్యాఖ్యాతగా అవకాశం రావడం నా అదృష్టం. ముంబైలో ఈ సిరీస్‌కు కామెంట్రీ చేస్తున్నా. హైదరాబాద్, అమెరికాలోని ఆర్డీఆర్ సెంటర్ ఫర్ క్రికెట్ ఆకాడమీ ద్వారా క్రికెట్ ప్లేయర్స్ అందించాలనేది నా లక్ష్యం. ఇప్పటికే ఆకాడమీల ద్వారా మంచి ప్లేయర్స్‌ను తయారుచేస్తున్నాం.
–రాకేశ్‌రెడ్డి
చిన్నప్పటి నుంచి అతడికి క్రికెటే పరమావధి. క్రికెటర్‌గా అనేక టోర్నీల్లో పాల్గొని సత్తా చాటాడు. అనంతరం సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా విదేశాల్లో ఉన్నా కూడా ఆటను వదలలేదు. క్రికెట్‌తో అనుబంధం కొనసాగిస్తూనే భావి ఆటగాళ్లను తీర్చిదిద్దే బాధ్యత తీసుకున్నాడు. అదే అభిరుచితో క్రికెట్‌పై విశ్లేషణలు చేయడం మొదలుపెట్టాడు. గ్రౌండ్లో జరిగే మ్యాచ్‌ను కళ్లకు కట్టినట్టు వివరించేస్తున్నాడు తెలంగాణ యువకుడు రాకేశ్ రెడ్డి. ఈ క్రమంలోనే ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య జరిగే ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్‌కు తెలుగులో కామెంట్రీ చేసే అవకాశం పొందాడు. గురువారం నుంచి మొదలవుతున్న యాషెస్ రెండో టెస్టుపై ‘సోనీ టెన్ 4’ ఛానల్లో విశ్లేషణచేయనున్న రాకేశ్‌పై ప్రత్యేక కథనం.
భూపాలపల్లి టౌన్: జిల్లాకేంద్రం భూపాలపల్లికి చెందిన సుధాకర్‌రెడ్డి, అపర్ణిత దంపతుల చిన్న కుమారుడు దేవ రాకేశ్‌రెడ్డికి చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే పిచ్చి. ఆడడమే కాదు.. విశ్లేషణ చేయడం అలవాటైంది. భూపాలపల్లిలో పదో తరగతి వరకు చదివి హైదరాబాద్‌లో ఇంటర్, ఇంజినీరింగ్ చేశాడు. విద్యాభ్యాసం చేస్తూనే అనేక క్రికెట్ టోర్నీల్లో ఆడాడు. ఆటగాడిగా రాణిస్తున్న క్రమంలోనే సాఫ్ట్వేర్ ఉద్యోగం పొందాడు. 2013 నుంచి 2015 వరకు హైదరాబాద్‌లో పనిచేసి అనంతరం 2015లో అమెరికాకు వెళ్లాడు. వృత్తిగతంగా సాఫ్ట్వేర్ అయినా మనసంతా క్రికెట్‌పైనే ఉంది. దీంతో 2016లో మేటి ఆటగాళ్లను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కాలిఫోర్నియాలో ఆర్డీఆర్ సెంటర్ ఫర్ క్రికెట్ అకాడమీని ఏర్పాటుచేశాడు. అక్కడ ప్రస్తుతం 200 మంది క్రికెట్లో శిక్షణ పొందుతున్నారు. స్వదేశానికి తిరిగొచ్చాక రాకేశ్ గతేడాది హైదరాబాద్‌లో ఆర్డీఆర్ సెంటర్ ఫర్ క్రికెట్ ఆకాడమీ ప్రారంభించాడు. ఇక్కడ 50 మంది శిక్షణ పొందుతున్నారు. సర్టిఫైడ్ క్రికెట్ కోచ్‌గా గుర్తింపు పొందాడు.
క్రికెట్లోని అన్ని విషయాలపై అవగాహన పొందిన రాకేశ్ స్పోర్ట్స్ అనలిస్టుగా మారాడు. ప్రాంతీయ, జాతీయ చానల్స్‌లో క్రికెట్‌పై విశ్లేషణలు చేయడం ప్రారంభించాడు. అనేక చానల్స్‌లో జరిగిన విశ్లేషణల్లో పాల్గొన్నాడు. తన వాయిస్‌తో క్రికెట్ వాణి వినిపిస్తున్నాడు. ఈ వరుసలోనే యాషెస్ సిరీస్‌కు కామెంటేటర్‌గా అవకాశం పొందాడు. మాజీ క్రికెటర్లు వెంకటపతిరాజు, సబా కరీం, లక్ష్మణ్ శివరామకృష్ణన్లాంటి దిగ్గజాలతోపాటు ప్రముఖ తెలుగు క్రికెట్ అనలిస్టు వెంకటేశ్ సుధీర్‌తో కామెంట్రీ బాక్స్‌ను పంచుకోనున్నాడు.