West Indies | ఒకప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని తన కనుసన్నలతో శాసించిన వెస్టిండీస్‌కు.. ఘోర అవమానం! 1975 నుంచి నిర్వహిస్తున్న వన్డే ప్రపంచకప్‌లో ప్రతీసారి బరిలోకి దిగిన కరీబియన్లు.. ఈ ఏడాది భారత్ వేదికగా జరుగనున్న వరల్డ్‌కప్‌నకు అర్హత సాధించలేకపోయారు. ప్రమాణాల పరంగా నానాటికి తీసికట్టులా మారుతున్న వెస్టిండీస్ జట్టు.. వన్డే ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీ సూపర్ సిక్స్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడి మెగాటోర్నీకి అర్హత సాధించే అవకాశం చేజార్చుకుంది. విశ్వవ్యాప్తంగా ఫ్రాంచైజీ క్రికెట్లో అదరగొడుతున్న కరీబియన్లు.. దేశం తరఫున కలిసి కట్టుగా ఆడలేక స్కాట్లాండ్ చేతిలో పరాజయం పాలయ్యారు.
హరారే: సుదీర్ఘ కాలం పాటు అంతర్జాతీయ క్రికెట్లో తిరుగులేని ఆధిపత్యం కనబర్చిన వెస్టిండీస్.. 2023 వన్డే ప్రపంచకప్‌నకు అర్హత సాధించలేకపోయింది. క్వాలిఫయింగ్ టోర్నీ సూపర్ సిక్స్‌లో విండీస్ వరుసగా మూడో పరాజయం మూటగట్టుకుంది. శనివారం జరిగిన పోరులో వెస్టిండీస్ 7 వికెట్ల తేడాతో స్కాట్లాండ్ చేతిలో ఓడింది. విండీస్‌పై స్కాట్లాండ్కు ఇదే తొలి విజయం కావడం విశేషం. మొదట బ్యాటింగ్ చేసిన కరీబియన్లు 43.5 ఓవర్లలో 181 పరుగులకు ఆలౌటయ్యారు. జాసన్ హోల్డర్ (45) టాప్ స్కోరర్ కాగా.. షెఫర్డ్ (36) పర్వాలేదనిపించాడు. కెప్టెన్ షై హోప్ (13), బ్రూక్స్ (0), చార్లెస్ (0), మయేర్స్ (5), పూరన్ (21), బ్రాండన్ కింగ్ (22) విఫలమయ్యారు. స్కాట్లాండ్ బౌలర్లలో బ్రాండెన్ మెక్ ములెన్ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో స్కాట్లాండ్ 43.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసింది. మాథ్యూ క్రాస్ (74 నాటౌట్), మెక్ ములెన్ (69) రాణించారు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ములెన్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. సూపర్ సిక్స్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిన విండీస్.. నామమాత్రంగా మిగిలిన రెండు మ్యాచ్‌ల బరిలోకి దిగాల్సి ఉంది.
ఆటను మరింత రసవత్తరంగా మార్చేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) 1975లో తొలిసారి వన్డే ప్రపంచకప్ నిర్వహించగా.. ైక్లెవ్ లాయిడ్ నాయకత్వంలోని వెస్టిండీస్ జట్టు జగజ్జేతగా నిలిచింది. నాలుగేండ్ల తర్వాత 1979లో జరిగిన వరల్డ్‌కప్‌లోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది. మరో నాలుగేండ్లకు అంటే 1983లో జరిగిన మెగాటోర్నీలోనూ కరీబియన్ జట్టు ఫైనల్ చేరింది. క్లెవ్ లాయిడ్, సోబర్స్, వివ్ రిచర్డ్స్, గార్డన్ గ్రీనిడ్జ్, హోల్డింగ్, కోట్నీ వాల్ష్, బ్రియాన్ లారా, క్రిస్ గేల్, డారెన్ సమీ, బ్రావో, పొలార్డ్.. ఇలా ఎందరో స్టార్ ఆటగాళ్లను ప్రపంచానికి అందించిన విండీస్ రోజు రోజుకు పేలవ ప్రదర్శనతో ప్రభ కోల్పోయింది. 2019 వన్డే ప్రపంచకప్‌నకు నేరుగా అర్హత సాధించలేక క్వాలిఫయింగ్ టోర్నీ ద్వారా ముందంజ వేసిన విండీస్.. ఈ సారి అదీ లేకుండానే ఇంటిబాట పట్టింది. ఆ దేశ క్రికెట్ బోర్డు ఆటగాళ్లతో వ్యవహరిస్తున్న తీరు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.