ఆదివారం 17 జనవరి 2021
Siddipet - Dec 04, 2020 , 00:22:25

కేంద్ర వ్యవసాయ చట్టంతో రైతులకు అన్యాయం

కేంద్ర వ్యవసాయ చట్టంతో రైతులకు అన్యాయం

  • కేంద్రం తీరుపై మంత్రి హరీశ్‌రావు ధ్వజం
  • నూతన చట్టం కార్పొరేట్‌కు అనుకూలం
  • బిల్లును వ్యతిరేకిస్తూ చిన్నకోడూరు సర్వసభ్య సమావేశం తీర్మానం
  • అభివృద్ధి పనుల పురోగతిపై సుదీర్ఘ సమీక్ష
  • రోడ్డు నిర్మాణ, మరమ్మతు పనులకు శంకుస్థాపన 

చిన్నకోడూరు : కేంద్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాన్ని తెచ్చి కార్పొరేట్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నదని, ఈ చట్టాన్ని తెచ్చి, రైతుల నోట్లో మట్టి కొట్టిందని మంత్రి హరీశ్‌రావు కేంద్ర ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. చిన్నకోడూరు ఎంపీడీవో కార్యాలయంలో గురువారం జరిగిన మండల సర్వసభ్య సమావేశానికి మంత్రి హరీశ్‌రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామాల వారీగా అభివృద్ధి పనుల పురోగతిపై వివిధ శాఖలకు చెందిన అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో సమీక్షించారు. బిల్లును వ్యతిరేకిస్తూ చిన్నకోడూరు సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ దేశంలోని 5 రాష్ర్టాల నుంచి 99 వేల ట్రాక్టర్లలో రైతులు ఢిల్లీకి కదిలివచ్చి సమ్మె చేస్తూ నిరసన తెలిపితే, కేంద్ర ప్రభుత్వం రైతుల నిరసనను అణచివేత చేసే ప్రయత్నంలో 5 మంది రైతులు మృతి చెందారన్నారు. వీరిలో ముగ్గురు వాటర్‌ క్యాన్‌ తగిలి, మరో ఇద్దరు చలి తీవ్రతతో మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత రైతుల కుటుంబాలకు మంత్రి ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం రైతుల చర్యలకు పిలిచి రాతపూర్వకంగా రాసిస్తే సమ్మె విరమిస్తామని రైతులు తెలిపితే.. కేంద్రం వద్ద సమాధానమే లేదన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉచితంగా కరెంట్‌ సరఫరా చేస్తూ.. రైతులు పండించిన ధాన్యం గిట్టుబాటు ధర కల్పిస్తామంటే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక జీవో తెచ్చి రైతులను ఆణచివేయాలని చూస్తుందని మండిపడ్డారు. బీజేపీ నూతన వ్యవసాయ చట్టాన్ని తెచ్చి రైతులను తీవ్ర అన్యాయానికి గురి చేస్తున్నదని మంత్రి పేర్కొన్నారు. 

 విత్తనోత్పత్తి దిశగా కృషి చేయాలి 

విత్తనోత్పత్తి కోసం మక్కజొన్న, వరి, సన్‌ఫ్లవర్‌ కంపెనీలు ఉత్సాహంగా ఉన్నాయని, సీడ్‌ డెవలప్మెంట్‌ కోసం రైతులు ముందుకు వచ్చేలా స్థానిక ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. మండలంలో ఏ గ్రామంలో మహిళా భవనం పెండింగ్‌లో ఉండొద్దని, ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. డంప్‌యార్డుల్లో ఈ నెలాఖరులోపు ఎర్రలు వేసి వినియోగంలోకి తేవాలని ఎంపీడీవో, ఎంపీవోలకు ఆదేశించారు. వినియోగంలోకి రాకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ రైతువేదికలు నిర్మాణాలయ్యేలా అధికారులు పర్యవేక్షించాలన్నారు. అంతకు ముందు గంగాపూర్‌లో గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందు పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి హరీశ్‌రావు, జడ్పీ అధ్యక్షురాలు రోజాశర్మతో కలిసి ప్రారంభించారు.

  రోడ్డు పనులకు పనులకు శంకుస్థాపన 

చిన్నకోడూరు పోలీసు స్టేషన్‌ నుంచి అంబేద్కర్‌ చౌరస్తా వరకు బీటీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన చేశారు. అంబేద్కర్‌ చౌరస్తా నుంచి మర్రిచెట్టు వరకు ఏర్పాటు చేసిన డివైడర్‌ పై బటర్‌ఫ్లై లైట్లను ప్రారంభోత్సవం చేశారు. మర్రిచెట్టు నుంచి అల్లీపూర్‌ వరకు బీటీ రోడ్డు మరమ్మత్తు పనులకు శంకుస్థాపన చేశారు. పెద్దకోడూరు నుంచి అల్లీపూర్‌ రూ.12 కోట్ల 86 లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణ పనులు ముమ్మరం చేయాలని ఆర్‌అండ్‌బీ డీఈ వెంకటేశ్వర్లు, పంచాయతీ రాజ్‌ శాఖ డీఈలను మంత్రి ఆదేశించారు. అంతకు ముందు ఎంపీడీవో కార్యాలయంలో అర్హులైన వారికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను మంత్రి హరీశ్‌రావు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కూర మాణిక్యరెడ్డి, గొర్ల పెంపకందారుల ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు శ్రీహరియాదవ్‌, రైతుబంధు సమితి జిల్లా డైరెక్టర్‌ వెంకటేశం, డీసీసీబీ డైరెక్టర్‌ రామచంద్రం, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ శ్రీనివాస్‌, సొసైటీ చైర్మన్లు కనకరాజు, సదానందంగౌడ్‌, రైతుబంధు మండల కన్వీనర్‌ మల్లేశంగౌడ్‌, తహసీల్దార్‌ శ్రీనివాస్‌రావు, ఎంపీడీవో శ్రీనివాస్‌, అధికారులు, స్థానిక సర్పంచు ఉమేశ్‌చంద్రం, ఎంపీటీసీలు ఇట్టబోయిన శ్రీనివాస్‌, శారద రమేశ్‌, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

  రంగనాయకసాగర్‌లో చేపపిల్లల విడుదల 

  చిన్నకోడూరు మండలంలోని రంగనాయకసాగర్‌లో గురువారం మంత్రి హరీశ్‌రావు చేపపిల్లలను వదిలారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ మత్స్యకారుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అన్ని చెరువుల్లో చేపపిల్లలను ఉచితంగా పంపిణీ చేస్తుందన్నారు. మత్స్యకారుల అభివృద్ధి ద్యేయంగా రాష్ట్ర వ్యాప్తంగా చేపపిల్లలను ఉచితంగా వదులుతున్నట్లు తెలిపారు.