బుధవారం 23 సెప్టెంబర్ 2020
Siddipet - Feb 25, 2020 , 23:27:07

‘ఆదర్శ’వంతమైన విద్య

‘ఆదర్శ’వంతమైన విద్య

దుబ్బాక, నమస్తే తెలంగాణ : రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు ఇంగ్లిష్‌ మీడియంలో విద్యా బోధన అందించాలనే లక్ష్యంతో మోడల్‌ (ఆదర్శ) పాఠశాలలను ఏర్పాటు చేసింది. ఈ పాఠశాలల్లో విద్యార్థులకు గుణాత్మక విద్యతోపాటు పౌష్టికాహారం అందజేస్తున్నారు. అలాగే, విద్యార్థులకు క్రీడలు, సాంస్కృతిక, వైజ్ఞానిక పోటీలు నిర్వ హించి, వారిని ఆదర్శంగా నిలుపుతున్నారు. కార్పొరేట్‌ విద్యా సంస్థలను తలదన్నే విధంగా మోడల్‌ పాఠశాల విద్యార్థులు అన్నింటా ముందుంటున్నారు. ఆదర్శ పాఠశాల ల్లో ఆరో తరగతిలో ప్రవేశాలతోపాటు ఏడు నుంచి పదో తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ప్రైవేట్‌ పాఠశాలల్లో వేలాది రూపాయల ఫీజులు చెల్లించలేని పేద కుటుంబాల్లోని పిల్లలకు ఉచితంగా ఇంగ్లిష్‌ మీడియంలో విద్య అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం 2013 లో ఆదర్శ పాఠశాలలను ప్రారంభించింది. 


సిద్దిపేట జిల్లాలో 14 మోడల్‌ స్కూళ్లు ఉన్నాయి. లచ్చపేట (దుబ్బాక), మిరుదొడ్డి, దౌల్తాబాద్‌, ఇర్కోడు (సిద్దిపేట), అక్కనపల్లి (నంగునూరు), కొండపాక, ముట్రాజ్‌పల్లి (గజ్వేల్‌), జగదేవ్‌పూర్‌, ముత్యాల (చేర్యాల), మద్దూరు, ఇబ్రహీంనగర్‌, బెజ్జంకి, నాగసముద్రాల (కోహెడ), హుస్నాబాద్‌లో మోడల్‌ స్కూల్‌ ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో ఇంటర్మీడియట్‌ వరకు చదువుకునే అవకాశం ఉంది. ఒక్కో పాఠశాలలో 820 మంది వి ద్యార్థులు విద్యనభ్యస్తారు. అలాగే, 6 నుంచి 10వ తరగతి వరకు 500 మంది విద్యార్థులు, ఇంటర్మీడియట్‌లో 320 మంది విద్యార్థులు మొత్తం 820 మంది విద్యార్థులు చదువుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది. ప్రతి విద్యా సంవత్సరంలో 6వ తరగతిలో 100 మంది విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తారు. టీఎస్‌ఎంఎస్‌ ఆధ్వర్యంలో ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభావంతులైన విద్యార్థులకు ఇంగ్లిష్‌ మీడియంలో విద్యనందించేందుకు ఏర్పాటు చేసిన  ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశం.. పిల్లల భవిష్యత్‌కు బంగారు అవకాశంగా మారిందని తల్లిదండ్రులు భావిస్తున్నారు.


దరఖాస్తు చేసేవిధానం...

 ఆన్‌లైన్‌లో లేదా మీ సేవ కేంద్రాల్లో 6వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 29 వరకు గడువు ఉంది. 7 నుంచి 10వ తరగతుల్లో ప్రవేశానికి మార్చి 2వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్థులు ప్రస్తుతం చదువుకుంటున్న పాఠశాల నుంచి బోనఫైడ్‌ సర్టిఫికెట్‌ తీసుకోవాల్సి ఉంటుంది. ఆధార్‌ కార్డు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో సమీపంలోని మీ సేవ కేంద్రాల్లో, ఆన్‌లైన్‌ కేంద్రాల్లో లేదా స్వయంగా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రూ.75, ఓసీలకు రూ.150గా నిర్ణయించారు. ప్రవేశ దరఖాస్తు ఫీజు సైతం ఆన్‌లైన్‌లోనే చెల్లించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు పూర్తి చేసి, వివరాలను నమోదు పత్రాన్ని  ఏ  పాఠశాలలో ప్రవేశం పొందాలనుకుంటున్నారో అక్కడి ప్రిన్సిపాల్‌కు దరఖాస్తును అందజేయాలి.   


రాతపరీక్ష విధానం...

ఏప్రిల్‌ 12న ప్రవేశాలకు రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇంగ్లిష్‌, తెలు గు భాషలో రాతపరీక్ష ఉంటుంది. పరీక్ష సమయం 2 గంటలు. 5వ తరగతి సామర్థ్యాల స్థాయికి అనుగుణంగా తెలుగు, గణితం, పరిసరాల విజ్ఞానం (సైన్స్‌ అండ్‌ సోషల్‌), ఇంగ్లిష్‌ సబ్జెక్టులపై 25 మార్కుల చొప్పున మొత్తం 100 మార్కుల పరీక్ష ఉంటుంది. పేపర్‌ మల్టీపుల్‌ చాయిస్‌ విధానంలో రూపొందిస్తారు. ఏడు నుంచి పదో తరగతి విద్యార్థులకు ఇంగ్లిష్‌, మ్యాథ్స్‌, జనరల్‌ సైన్స్‌, సోషల్‌ స్టడీస్‌పై 25 మార్కుల చొప్పున 100 మార్కుల పరీక్ష ఉంటుంది. ప్రవేశ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. ఓసీ, బీసీ 

విద్యార్థులు 35 మార్కులు సాధించాల్సి ఉంటుంది.


ముఖ్యమైన సమాచారం...

  • 6వ తరగతికి ఈ నెల 29 వరకు దరఖాస్తుల స్వీకరణ.
  • 7 నుంచి 10వ తరగతులకు మార్చి 2వ తేదీ గడువు
  • ఏప్రిల్‌ 9 నుంచి 12వ తేదీ వరకు హాల్‌ టికెట్ల పంపిణీ. 
  • ఏప్రిల్‌ 12న 6వ తరగతిలో ప్రవేశానికి ఉదయం 10 నుంచి 12 గంటలు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు 7-10 తరగతుల్లో ప్రవేశ పరీక్ష ఉంటుంది.
  • మే 20న ఫలితాల వెల్లడి
  • మే 27న అర్హత సాధించిన విద్యార్థుల జాబితాను సంబంధిత పాఠశాలల్లో  నోటీసు బోర్డుపై ఉంచుతారు.
  • మే 28 నుంచి 31 వరకు విద్యార్హత పత్రాల పరిశీలన.
  • జూన్‌లో తరగతులు ప్రారంభం.


ఆదర్శ పాఠశాలలో చేరితే ఉజ్వల భవిష్యత్‌..

పేదవిద్యార్థులకు ఆదర్శ (మోడల్‌) పాఠశాలలు వరంగా మారాయి. కా ర్పొరేట్‌ పాఠశాలలకు ధీటుగా విద్యార్థులకు విద్యాబోధన ఉంటుంది. ఇప్పటికే ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశ పరీక్ష ప్రకటన విడుదలైంది. గ్రామీణ విద్యార్థులతోపాటు పట్టణ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా సుమారు 3 వేల దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. విద్యార్థులకు పౌష్టికాహారంతో పాటు గుణాత్మక విద్య లభిస్తుంది. ఆదర్శ పాఠశాలల్లో పిల్లలను చేర్పించడం ద్వారా  వారికి మంచి భవిష్యత్‌ కల్పించే అవకాశం తల్లిదండ్రులకు దక్కుతుంది. 

- నాగరాజు (ఇర్కోడు మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌)  

  

పేద విద్యార్థులకు మంచి అవకాశం..

 ప్రభుత్వం పేదవిద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ఆదర్శ పాఠశాలలను సద్వినియోగపర్చుకోవాలి. ముఖ్యంగా గ్రామీణ పే దలకు వరంగా చెప్పవచ్చు. వేలా ది రూపాయలు చెల్లించి పిల్లలను ప్రైవేట్‌ పాఠశాలల్లో చేర్పించే కం టే  ఆదర్శ పాఠశాల ల్లో చేర్పించాలి. ఇక్కడ ఉచిత వసతి తోపాటు  గుణాత్మక విద్యనందిస్తారు. ఆదర్శ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు విద్యతోపాటు, క్రీడలు, శాస్త్రీయ రంగాల్లో శిక్షణ ఇస్తాం. విద్యార్థులపై నిరంతర పర్యవేక్షణ ఉంటుంది. పాఠశాలకు పక్క భవనం, ఆహ్లాదకర వాతావరణంలో విద్యార్థులు చదువుకునే అవకాశం ఉంది.  

 - సుప్రియ (లచ్చపేట మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌)


logo