గుండె, మెదడులో రక్తం గడ్డకట్టడాన్ని తెలుసుకునేందుకు మాగ్నటిక్ రెసోనెన్స్ ఇమేజింగ్ (ఎమ్ఆర్ఐ) యంత్రం సాయంతో స్కానింగ్ చేస్తారు. ఇందుకోసం ఒక్కొక్కరికి చాలా సమయం పడుతుంది. అతి శీతలంగా ఉండే గదిలో ఎమ్ఆర్ఐ స్కానింగ్ చేయాల్సి రావడం, పేషెంట్ కదలకుండా ఎక్కువ సమయం పడుకొని ఉండాల్సి రావడంతో స్కానింగ్ చేయడం ఇబ్బందిగా ఉంటుంది. దీన్ని అధిగమించేందుకు బ్రిటన్‌కు చెందిన శాస్త్రవేత్తలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో కొత్త టెక్నాలజీకి రూపునిచ్చారు.
రక్తనాళాల్లో రక్తం గడ్డలను గుర్తించడంలో ఎమ్ఆర్ఐ స్కాన్ చాలా ముఖ్యమైనది. ఎందరో ఈ స్కానింగ్ చేయించుకునేందుకు నిత్యం దవాఖానల వద్ద పడిగాపులు పడుతుంటారు. ఒక్క అమెరికాలోనే 12 లక్షల మందికిపైగా ఏటా ఎమ్ఆర్ఐ చేయించుకుంటున్నట్లు అక్కడి గణాంకాలు చెప్తున్నాయి. సాధారణంగా ఎమ్ఆర్ఐ చేయడానికి తక్కువలో తక్కువ 45 నిమిషాల నుంచి 90 నిమిషాల సమయం పడుతుంది. దాంతో ఎక్కువ మందికి ఎమ్ఆర్ఐ స్కాన్ చేయడం కష్టంగా మారింది.
ఈ సమస్య నుంచి బయటపడేందుకు బ్రిటన్‌కు చెందిన హార్ట్ ఫౌండేషన్ శాస్త్రవేత్తలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ని ఉపయోగించి చేసే ఎమ్ఆర్ఐ యంత్రాన్ని రూపొందించారు. ఈ యంత్రాన్ని ఉపయోగించి తక్కువ సమయంలో అంటే కేవలం 20 సెకన్ల వ్యవధిలో గుండె జబ్బులు, రక్తనాళాల్లో అడ్డంకులను గుర్తించే వీలున్నదని పరిశోధకులు వెల్లడించారు.
ఈ కొత్త టెక్నాలజీ ద్వారా సాధారణ చెకప్‌తో పోలిస్తే 13 నిమిషాల వరకు సమయం ఆదా అవుతుంది. ఇది ఒక వైద్యుడి కంటే 40 రెట్లు వేగంగా గుండెను స్కాన్ చేస్తుంది. ప్రస్తుతం ఈ టెక్నాలజీని యూనివర్సిటీ ఆఫ్ లండన్ హాస్పిటల్లో ఉపయోగిస్తున్నారు. అక్కడ ప్రతి వారం 140 మంది హృద్రోగులకు పరీక్షలు జరుపుతున్నారు.
సంక్లిష్టమైన గుండె నిర్మాణాలను సులభంగా గుర్తించి రోగులకు చికిత్స అందించడంలో ఈ కొత్త టెక్నాలజీ ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ఈ ప్రాజెక్టుకు నాయకత్వం వహిస్తున్న డాక్టర్ రోడ్రి డేవిస్ తెలిపారు. ఈ టెక్నిక్ ద్వారా డాక్టర్ అపాయింట్మెంట్లకు పట్టే సమయం కూడా తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. గుండెపోటు, అధిక రక్తపోటు, హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి, గుండె కండరాల బలహీనతలను ఈ టెక్నాలజీ ద్వారా గుర్తించే వీలున్నదని ఆయన పేర్కొన్నారు.