న్యూఢిల్లీ : ఆర్ధిక మందగమనం, ఆర్ధిక మాంద్య భయాలు వెంటాడుతుండటంతో టెక్ దిగ్గజాలు మాస్ లేఆఫ్స్‌కు తెగబడుతుండగా పలు టెక్ కంపెనీలు నేరుగా కొలువుల కోతకు దిగకుండా వేతనాల్లో భారీ కోతలకు పాల్పడుతున్నాయి. ఖర్చులకు కళ్లెం వేస్తూ వేతన బిల్లులను తగ్గించుకునేందుకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. మాస్ లేఆఫ్స్‌కు ప్రత్యామ్నాయంగా సిబ్బంది వేతనాలకు గండిపెడుతూ మాంద్యం గండం గట్టెక్కేందుకు పలు టెక్ కంపెనీలు సరికొత్త వ్యూహానికి పదును పెడుతున్నాయి. ఐటీ దిగ్గజం ఇంటెల్ ఇటీవల కొలువుల కోతకు బదులు వేతన కోతలకు మొగ్గుచూపింది. కంపెనీ నిర్ణయంతో ఆ సంస్థ సీఈవో పాట్ గెల్సింగర్ వేతనంలో 25 శాతం, ఎగ్జిక్యూటివ్ స్థాయి ఉద్యోగులకు 15 శాతం, సీనియర్ మేనేజర్లకు 10 శాతం, మధ్యస్థాయి మేనేజర్లకు 5 శాతం కోత విధిస్తారు. కంపెనీపై పెరిగిపోతున్న ఆర్థిక పరమైన భారాన్ని తగ్గించుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఇంటెల్ తెలిపింది.
ఇక ఇదే ధోరణిలో అధిక వార్షిక వేతనం ఆఫర్ చేస్తూ ఫ్రెషర్స్‌ను రిక్రూట్ చేసుకున్న ఐటీ దిగ్గజం విప్రో తాజాగా వారి వేతనంలో 50 శాతం కోత విధిస్తోంది. విప్రోలో విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్న ఫ్రెషర్స్‌కు రూ. 6.5 లక్షల వార్షిక వేతనం చెల్లిస్తామని కంపెనీ తొలుత హామీ ఇచ్చింది. అయితే తొలుత తాము ఆఫర్ చేసిన వార్షిక వేతనంలో 50 శాతం తక్కువ వేతనంతో సర్దుకోవాలని విప్రో ప్రస్తుతం వారిని కోరుతోంది.
ఫ్రెషర్స్‌కు విప్రో కేవలం రూ . 3.6 లక్షల వార్షిక వేతనాన్నే చెల్లించనున్నట్టు ఫ్రెష్ రిక్రూటర్స్‌కు కంపెనీ పంపిన ఈమెయిల్ స్పష్టం చేసిందని ఓ వార్తా సంస్ధ పేర్కొంది. ఈ ఏడాది కంపెనీ గ్రాడ్యుయేట్స్ ప్రోగ్రాం కింద ఎంపికైన విప్రో అభ్యర్ధులందరికీ తక్కువ వేతన ఆఫర్‌ను కంపెనీ వర్తింపచేస్తోంది. తక్కువ శాలరీకి కంపెనీలో పనిచేసేందుకు సుముఖంగా ఉన్నారా లేదా అనేది తేల్చుకునేందుకు అభ్యర్ధులకు విప్రో తగినంత సమయం ఇచ్చింది.
పరిశ్రమలో ఇతర కంపెనీల తరహాలోనే తామూ ప్రపంచ మార్కెట్లు, కస్టమర్ల అవసరాలను పరిగణనలోకి తీసుకుని హైరింగ్ ప్రణాళికలు రూపొందిస్తున్నామని ప్రస్తుతం ప్రాజెక్టు ఇంజనీర్లను రూ. 3.5 లక్షల వార్షిక వేతనంతో రిక్రూట్ చేస్తున్నామని ఫ్రెషర్లకు పంపిన ఈమెయిల్లో కంపెనీ పేర్కొంది. మారిన స్ధూల ఆర్ధిక పరిస్ధితులు, వ్యాపార అవసరాల నేపధ్యంలో ఫ్రెషర్ల వేతన ప్యాకేజ్‌లో కోత విధిస్తూ విప్రో నిర్ణయం తీసుకుంది. వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగానే కంపెనీ ఈ నిర్ణయం తీసుకుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.