WhatsApp | వాట్సప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రపంచవ్యాప్తంగా వాట్సప్ మెసెంజర్‌కు చాలా డిమాండ్ ఉంది. ముఖ్యంగా భారత్‌లో అయితే స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు వాట్సప్‌ను వినియోగిస్తున్నారు. ఇదివరకు ఎవరికైనా మెసేజ్ పంపించాలంటే ఒక్క ఎస్ఎంఎస్కు రూపాయి బ్యాలెన్స్ కట్ అయ్యేది. కానీ.. ఇప్పుడు వందల, వేల మెసేజ్‌లు వాట్సప్ ద్వారా ఉచితంగా పంపించుకోవచ్చు. వాయిస్ కాల్స్, వీడియో కాల్స్ కూడా చేసుకునే సదుపాయం వాట్సప్‌లో ఉండటంతో వాట్సప్‌కు ఆదరణ పెరిగింది.
కొందరు వాట్సప్‌ను ఆసరాగా చేసుకొని సైబర్ క్రైమ్స్‌కు పాల్పడుతున్నారు. ఫేక్ మెసేజ్‌లు పంపించడం, స్కామ్స్, ఫిషింగ్ లింక్స్ పంపించడం, ఫేక్ న్యూస్ ప్రచారం చేయడం.. ఇలా పలు రకాల చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు వాట్సప్ గుర్తిస్తోంది. దీంతో ఎప్పటికప్పుడు అటువంటి అనుమానాస్పద అకౌంట్లను వాట్సప్ బ్యాన్ చేస్తోంది.
ఇటీవలే భారత్‌లో సరికొత్త ఐటీ రూల్స్ కూడా వచ్చాయి. ఇంటర్మీడియరీ గైడ్‌లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ ప్రకారం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ఖచ్చితంగా అసభ్యకరమైన కంటెంట్ మీద దృష్టి సారించాలి. అటువంటి అనుమానాస్పద కంటెంట్ ఉన్న అకౌంట్లను వెంటనే బ్లాక్ చేయాలి.
అందుకే.. వాట్సప్ గడిచిన 6 నెలల్లో భారత్‌లో 1.32 కోట్ల వాట్సప్ అకౌంట్లను బ్యాన్ చేసింది. డిసెంబర్ 2021లో 20 లక్షలకు పైగా అకౌంట్లను బ్యాన్ చేసింది.
కొత్త ఐటీ రూల్స్‌తో పాటు వాట్సప్ టర్మ్స్ ఆఫ్ యూజ్ను అతిక్రమించినందుకు ఈ అకౌంట్లను బ్యాన్ చేసింది. దాని కోసమే అబ్యూజ్ డిటెక్షన్ మెకానిజాన్ని వాట్సప్ తీసుకొచ్చింది. ఎక్కువమంది యూజర్లు అకౌంట్‌ను రిపోర్ట్ చేసినా.. బ్లాక్ చేసినా దాని ఆధారంగా అకౌంట్లను బ్లాక్ చేస్తుంది.
15 మే 2021 నుంచి 15 జూన్ 2021 వరకు 20,11,000 వాట్సప్ అకౌంట్లు, 16 జూన్ 2021 నుంచి 31 జులై 2021 వరకు 30,27,000 అకౌంట్లు, 1 ఆగస్టు 2021 నుంచి 31 ఆగస్టు 2021 వరకు 20,70,000 అకౌంట్లు, 1 సెప్టెంబర్ 2021 నుంచి 30 సెప్టెంబర్ 2021 వరకు 22,09,000 అకౌంట్లు, 1 అక్టోబర్ 2021 నుంచి 31 అక్టోబర్ 2021 వరకు 20,69,000 వాట్సప్ అకౌంట్లు, 1 నవంబర్ 2021 నుంచి 30 నవంబర్ 2021 వరకు 17,59,000 అకౌంట్లు, 1 డిసెంబర్ 2021 నుంచి 31 డిసెంబర్ 2021 వరకు 20,79,000 వాట్సప్ అకౌంట్లను.. మొత్తంగా 15 మే నుంచి 31 డిసెంబర్ 2021 వరకు వాట్సప్ 1,52,24,000 ఇండియన్ అకౌంట్లను బ్యాన్ చేసినట్టు వాట్సప్ తాజాగా వెల్లడించింది.