WhatsApp | వాట్సప్ పేరెంట్ కంపెనీ మెటా.. ఎప్పటికప్పుడు వాట్సప్ మెసెంజర్‌ను అప్డేట్ చేస్తూ ఉంటుంది. కొత్త కొత్త ఫీచర్లను తీసుకొస్తూ ఉంటుంది. రూల్స్, రెగ్యులేషన్స్ అన్నీ సక్రమంగా ఉండేలా ఎప్పటికప్పుడు మార్పులు చేస్తుంటుంది.
దానిలో భాగంగానే వాట్సప్ రూల్స్‌ను బ్రేక్ చేసిన అకౌంట్లను ఎప్పటికప్పుడు వాట్సప్ బ్యాన్ చేస్తుంటుంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అటువంటి అకౌంట్లను లక్షల్లో బ్యాన్ చేసింది. జనవరి 2022లో వాట్సప్.. ఇండియాకు చెందిన 18.58 లక్షల అకౌంట్లను బ్యాన్ చేసింది.
యూజర్ల నుంచి వచ్చిన ఫిర్యాదులు, రూల్స్ అతిక్రమణ లాంటి అంశాల ఆధారంగా వాట్సప్ ఆయా అకౌంట్లను బ్యాన్ చేసింది. యాప్‌లో ఉన్న ఫీచర్లను ఉపయోగించి.. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డ అకౌంట్లు, అసభ్యకరమైన సందేశాలు పంపించడం, వేధింపులు.. ఇలా పలు రకాల అంశాలను పరిగణనలోకి తీసుకొని వాట్సప్.. 18.58 లక్షల అకౌంట్లను బ్యాన్ చేసింది.