Vi Finance | వీఐ (వొడాఫోన్ ఐడియా) తన కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. వీఐ ఫైనాన్స్ పేరిట ఓ సరికొత్త ప్లాట్ ఫామ్‌ను ఆవిష్కరించినట్లు తెలియజేసింది. వీఐ యాప్‌లోనే ఈ ప్లాట్‌ఫామ్ సేవలను పొందవచ్చు. దీని ద్వారా వీఐ వినియోగదారులు సులభంగా పర్సనల్ లోన్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు, క్రెడిట్ కార్డుల వంటి సదుపాయాలను పొందవచ్చు. వీఐ యాప్ ద్వారా ఇప్పటికే బిల్లు చెల్లింపులు, వినోదం, గేమింగ్, షాపింగ్ వంటి సేవలను అందిస్తున్నారు. ఈ క్రమంలో వీఐ ఫైనాన్స్‌ను ఇందులో కొత్తగా ప్రవేశపెట్టారు. ఈ ప్లాట్ ఫామ్ సహాయంతో వినియోగదారులు తమ ఆర్థిక అవసరాలను తీర్చుకోవడం సులభతరం అవుతుందని కంపెనీ చెబుతోంది. ఇందుకు గాను పలు ఆర్థిక సంస్థలతో భాగస్వామ్యం అయినట్లు వీఐ తెలియజేసింది.
వీఐ ఫైనాన్స్ ప్లాట్ ఫామ్‌లో కస్టమర్లు సులభంగా పర్సనల్ లోన్లను పొందవచ్చు. ఇందుకు గాను ఆదిత్య బిర్లా సంస్థతో వీఐ భాగస్వామ్యం అయింది. ఎలాంటి సెక్యూరిటీ లేకుండానే ఆకర్షణీయమైన వడ్డీ రేట్లకు సులభ వాయిదాల్లో చెల్లించే విధంగా పర్సనల్ లోన్లను అందిస్తున్నారు. రూ.50వేల ప్రారంభం నుంచి కస్టమర్లు లోన్లు తీసుకోవచ్చు. వడ్డీ రేటును ఏడాదికి 10.99 శాతంగా అందిస్తున్నారు. లోన్ పొందే ప్రక్రియ పూర్తిగా డిజిటల్ రూపంలో ఉంటుంది. ఇందుకు గాను ఎలాంటి ఫిజికల్ పత్రాలను అందించాల్సిన పనిలేదు. పేపర్‌లెస్ విధానంలో లోన్ దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది. దీంతో కేవైసీని సులభంగా పూర్తి చేయవచ్చు. అత్యవసరంగా రుణ సదుపాయం పొందాలనుకునే వారికి ఈ ప్లాట్ ఫామ్ చాలా ఉపయుక్తంగా ఉంటుంది.
వినియోగదారులు వీఐ ఫైనాన్స్ ప్లాట్ ఫామ్‌లో ఫిక్స్డ్ డిపాజిట్లను కూడా చేయవచ్చు. ఇందుకు గాను అప్ స్వింగ్ ఫైనాన్షియల్ టెక్నాలజీస్ అనే ఫిన్ టెక్ స్టార్టప్ సంస్థతో వీఐ భాగస్వామ్యం అయింది. కస్టమర్లు కనిష్టంగా రూ.1000 ఫిక్స్డ్ డిపాజిట్ చేయవచ్చు. 8.4 శాతం వడ్డీ రేటును పొందవచ్చు. రూ.5 లక్షల వరకు కస్టమర్లు చేసే ఫిక్స్డ్ డిపాజిట్లకు గాను డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ తరఫు నుంచి హామీ కూడా లభిస్తుంది. అలాగే వీఐ ఫైనాన్స్ ప్లాట్ ఫామ్ ద్వారా వినియోగదారులు క్రెడిట్ కార్డులను పొందవచ్చు. ఇందుకు గాను క్రెడిలియో అనే సంస్థతో వీఐ భాగస్వామ్యం అయినట్లు తెలిపింది. ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ వంటి ప్రముఖ బ్యాంకులకు చెందిన క్రెడిట్ కార్డుల కోసం ఈ ప్లాట్ ఫామ్‌లో అప్లై చేయవచ్చు. ఎఫ్డీ ఆధారిత క్రెడిట్ కార్డులను కూడా పొందవచ్చు. ఈ కార్డుల ద్వారా చేసే చెల్లింపులకు గాను కస్టమర్లు క్యాష్ బ్యాక్, రాయితీలు, రివార్డులు, ఈజీ ఈఎంఐ వంటి సదుపాయాలను పొందగలుగుతారు. పేపర్ లెస్ పద్ధతిలో క్రెడిట్ కార్డులకు అప్లై చేయవచ్చు.
వీఐ ఫైనాన్స్ ప్లాట్ ఫామ్‌ను వీఐ కస్టమర్లు వీఐ యాప్ ద్వారా పొందవచ్చు. ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్‌తోపాటు యాపిల్ యాప్ స్టోర్‌లోనూ అందుబాటులో ఉంది. ఈ సందర్భంగా వీఐ సీఎంవో అవనీష్ ఖోస్లా మాట్లాడుతూ తమ కస్టమర్లకు ఆర్థిక అవసరాల కోసం ఈ ప్లాట్ ఫామ్‌ను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. దీని సహాయంతో సులభంగా లోన్లను తీసుకోవడంతోపాటు తమ డబ్బును ఎఫ్డీ చేయవచ్చని, క్రెడిట్ కార్డులకు అప్లై చేసే సౌలభ్యం కూడా ఉందన్నారు. కాగా ఎయిర్ టెల్ వంటి యాప్‌లలో ఇప్పటికే ఈ తరహా సదుపాయాలు అందుబాటులో ఉన్న విషయం విదితమే.