Twitter Vs Meta | ట్విట్టర్.. ఫేస్బుక్.. ఇన్స్టాగ్రామ్.. వాట్సాప్.. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్… నష్టాల్లో చిక్కుకున్న మైక్రోబ్లాగింగ్ ప్లాట్పామ్ ట్విట్టర్‌ను టెస్లా చీఫ్ ఎలన్‌మస్క్ టేకోవర్ చేసుకున్న తర్వాత గందరగోళంలో చిక్కుకున్నది. అంతర్జాతీయంగా ట్విట్టర్ ఎంతో పాపులర్. ఎలన్‌మస్క్ ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉండటంతో అప్రతిష్ట పాలైంది. దీంతో యూజర్లు ప్రత్యామ్నాయ వేదిక కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకునే వ్యూహం అమలు చేస్తున్నది ఫేస్బుక్ మాతృసంస్థ మెటా.. ట్విట్టర్‌కు పోటీగా సరికొత్త సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌కు రూపునిస్తున్నది.
ఇందుకు ఒక యాప్ అందుబాటులోకి తెచ్చేందుకు మెటా సిద్ధమైంది. ట్విట్టర్‌కు పోటీగా తయారు చేస్తున్న ఈ మైక్రోబ్లాగింగ్ వేదిక వివరాలపై మెటా పూర్తి క్లారిటీ ఇవ్వలేదు. కానీ మెటా `ట్విట్టర్` యాప్ డెవలప్మెంట్ దశలో ఉన్నట్లు కొన్ని అంతర్జాతీయ సంస్థల నివేదికలు చెబుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు మెటా `పీ-92` అనే కోడ్ ఇచ్చినట్లు ఆ అంతర్జాతీయ సంస్థల నివేదికలు అంటున్నాయి.
ఇన్స్టాగ్రామ్ బ్రాండ్ పేరుతో కొత్త సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ యూజర్లకు అందుబాటులోకి వస్తుందని తెలుస్తున్నది. ఇప్పటికే ఇన్స్టాగ్రామ్ ఖాతా పొందిన యూజర్లు `పీ-92`లో పేరు రిజిస్టర్ చేసుకోవచ్చు.. స్వతంత్రంగా కూడా కొత్త అకౌంట్ తెరవొచ్చునని మెటా వర్గాలు తెలిపాయి. అంతే కాదు ఇతర సోషల్ మీడియా వేదికల్లో చేసిన పోస్టులను కూడా ఇందులో షేర్ చేయవచ్చునని అంటున్నారు. `పీ-92`లో యూజర్ బయో, బ్యాడ్జెస్ తదితర అన్ని ఫీచర్లు ఉంటాయని సమాచారం. రీషేర్ ఫీచర్ చేరుస్తారా.. లేదా.. అన్న విషయమై క్లారిటీ రాలేదు. ప్రస్తుతం ఇందులో ఉన్న ఫీచర్లు, ఇతర అంశాలు, అది యూజర్లకు ఎప్పుడు అందుబాటులోకి వస్తుందన్న విషయమై ఇప్పుడేమీ చెప్పలేం అని మెటా వర్గాల కథనం.
టెక్నాలజీపరమైన లోపాలు, అకౌంట్ల తొలగింపు వంటి చర్యలతో ట్విట్టర్ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నది. ఈ తరుణంలో కొత్త ప్లాట్‌ఫామ్‌ను తేవాలని మెటా నిర్ణయానికి రావడం ఆసక్తికర పరిణామం. గతేడాది 44 బిలియన్ డాలర్లకు ట్విట్టర్‌ను టేకోవర్ చేశారు ఎలన్‌మస్క్. అలా సంస్థను టేకోవర్ చేయగానే ఇలా సీఈవో పరాగ్ అగర్వాల్‌తోపాటు 4,700 మంది ట్విట్టర్ ఉద్యోగులను తొలగించారు. బ్లూ టిక్ చందా అమల్లోకి తీసుకొచ్చారు. మరోవైపు టెక్నికల్ పొరపాట్లు తలెత్తుతున్నాయి. దీంతో యూజర్లు ట్విట్టర్ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశాన్ని పలు సంస్థలు తమకు అనుకూలంగా మార్చుకోవాలని.. ట్విట్టర్‌కు ఆల్టర్నేటివ్ తేవడానికి రెడీ అవుతున్నాయి. మాస్టోడాన్, పోస్ట్న్యూస్, టీ2 వంటి ప్లాట్‌ఫామ్స్ వచ్చాయి.