ఇప్పటివరకు కరోనా వైరస్ను గుర్తించేందుకు ఆర్టీ పీసీఆర్, యాంటిజెన్ పరీక్షలు జరుపుతున్నారు. ముక్కు, గొంతులో నుంచి తీసిన ద్రావకంలో వైరస్ ఉన్నదీ లేనిదీ ఈ పరీక్షల ద్వారా నిర్ధారించేవారు. అయితే, స్వాబ్ తీయడం ఇబ్బందికరంగా ఉండటంతో చాలా మంది వెనకడుగు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్వీడీష్ శాస్త్రవేత్తలు 2 కొత్త పరికరాలను తయారు చేశారు. ఇందులో 3 సార్లు దగ్గడం ద్వారా ఇన్ఫెక్షన్ను గుర్తించవచ్చు. వీరి పరిశోధన అధ్యయనం విశేషాలు.. ఇన్ఫ్లుయెంజా అండ్ అదర్ రెస్పిరేటరీ వైరసెస్ జర్నల్లో ప్రచురితమైంది.
స్వీడన్లోని యూనివర్శిటీ ఆఫ్ గోథెన్బర్గ్కు చెందిన పరిశోధకులు.. పార్టికల్స్ ఇన్ ఎక్స్హేల్డ్ ఎయిర్, బ్రీత్ ఎక్స్ప్లోర్ అనే రెండు పరికరాలను అభివృద్ధి చేశారు. వీరు అభివృద్ధి చేసిన పరికరంలోకి దగ్గు శ్వాస పరీక్ష ద్వారా ఉత్తమ ఫలితాలను సాధించారు. ‘ఈ శ్వాస పరీక్షల ద్వారా 5 మైక్రోమీటర్ల కంటే తక్కువ వ్యాసంలో ఉండే చాలా చిన్న కణాలను కూడా గుర్తించగలం. వైరస్ కణాల జన్యు భాగమైన ఆర్ఎన్ఏను గుర్తించగలిగాం’ అని పరిశోధనకు నాయకత్వం వహించిన ఎమిలియా విక్లండ్ పేర్కొన్నారు. ప్రస్తుతం అభివృద్ధి చేసిన ఈ మూడు ఆవిష్కరణలపై మరింత లోతుగా పరిశోధన నిర్వహించనున్నట్లు అధ్యయనకారులు తెలిపారు.