Google on Slice App | ఇప్పుడంతా టెక్నాలజీ మయం.. ప్రతి ఒక్కరి చేతిలోనూ స్మార్ట్ ఫోన్ తప్పనిసరి ఉంటున్నది. దాని వాడకం పెరిగిపోయినా కొద్దీ యూజర్లు వివిధ అవసరాలకు యాప్స్ సేవలు వినియోగిస్తుంటారు. కొన్ని యాప్‌లు పారదర్శక సేవలు అందిస్తూ ఉంటే.. మరికొన్ని యూజర్ల డేటా సేకరిస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇటువంటి యాప్‌లను సెర్చింజన్ గూగుల్ ఎప్పటికప్పుడు గుర్తిస్తుంది. వాటిని తొలగించుకోవాలని స్మార్ట్ ఫోన్ యూజర్లను హెచ్చరిస్తూ ఉంటుంది. గూగుల్‌లో గూగుల్ ప్లే ప్రొటెక్ట్ అనే టూల్ ఉంది. దీని పని మాల్వేర్ సాయంతో యూజర్ల డేటా తస్కరించే యాప్‌లను గుర్తించడమే. అటువంటి యాప్‌లను తన స్కానర్ ద్వారా గూగుల్ ప్లే ప్రొటెక్టెట్ గుర్తిస్తుంది.
అలా తాజాగా ప్రొటెక్ట్ జరిపిన స్కానింగ్‌లో క్రెడిట్ కార్డు జారీ యాప్ `స్లైస్` చిక్కింది.ఈ ఫిన్‌టెక్ సంస్థ స్లైస్ యాప్‌లో యూజర్ల డేటా తస్కరించే మాల్వేర్ ఉందని గమ స్కానింగ్‌లో గుర్తించామని గూగుల్ వివరించింది. దీంతో యూజర్లు స్లైస్ యాప్ తక్షణం తొలగించుకోవాలని సూచించింది.
దీంతో పలువురు యూజర్లు స్లైస్ యాప్ నోటిఫికేషన్లపై క్లిక్ చేశారు. అప్పుడు గూగుల్ ప్లే ప్రొటెక్ట్ పేజీ రీ డైరెక్ట్ అయింది.. అక్కడ ఈ యాప్ (స్లైస్) మీ వ్యక్తిగత డేటా, మెసేజ్‌లు, ఫొటోలు, ఆడియో రికార్డింగ్స్ కాల్ హిస్టరీ ట్రాక్ చేయొచ్చు. మా ప్లే ప్రొటెక్ట్.. ఈ యాప్ డిలిట్ చేసుకోవాలని సూచించింది అని గూగుల్ పేర్కొన్నట్లు యూజర్లు తెలిపారు.
సెర్చింజన్ ఆరోపణలపై స్లైస్ యాప్ యాజమాన్యం రియాక్టయింది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి తమ యాప్ వాడకం రిస్క్‌తో కూడిందని మెసేజ్ వచ్చిందని తెలిపింది. సాంకేతిక లోపం తలెత్తిందని, తమ యాప్‌లో సాంకేతిక లోపం తలెత్తిందని, గంటల వ్యవధిలోనే పరిష్కరించామని స్లైస్ యాప్ వివరణ ఇచ్చింది.
ఇప్పటికీ ఒక శాతం యూజర్లు తమ పాత వర్షన్ యాప్ వాడుతున్నారని, వారిని తమ కొత్త వర్షన్ యాప్ అప్డేట్ చేసుకోవాలని సూచిస్తున్నాం అని పేర్కొంది. యూజర్ల వ్యక్తిగత డేటా భద్రతకు కట్టుబడి ఖచ్ఛితమైన నిబంధనలు పాటిస్తున్నామని వివరించింది. ఎటువంటి పరిస్థితుల్లోనైనా యూజర్ల డేటాకు ముప్పు వాటిల్లనివ్వబోమని వివరణ ఇచ్చింది.