Samsung Galaxy Z TriFold | ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీదారు శాంసంగ్ మరో అద్భుతమైన ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్‌ను సైలెంట్‌గా రిలీజ్ చేసింది. గెలాక్సీ జడ్ ట్రై ఫోల్డ్ పేరిట కంపెనీకి చెందిన తొలి ట్రై ఫోల్డ్ స్మార్ట్ ఫోన్‌ను దక్షిణ కొరియా మార్కెట్లో తాజాగా విడుదల చేశారు. ఇందులో పలు అద్భుతమైన ఫీచర్లను అందిస్తున్నారు. ఈ ఫోన్ మల్టీ ఫోల్డింగ్ ఫామ్ ఫ్యాక్టర్‌ను కలిగి ఉండడం విశేషం. ఏకంగా మూడు సార్లు ఈ ఫోన్‌ను మడతబెట్టేందుకు అవకాశం ఉంటుంది. అందుకనే ఈ ఫోన్‌కు ట్రై ఫోల్డ్‌గా నామకరణం చేసి రిలీజ్ చేశారు. ఈ ఫోన్ పూర్తిగా ఫోల్డ్ అయినప్పుడు సింగిల్ ఫోన్ మాదిరిగా ఉంటుంది. 6.5 ఇంచుల డిస్ ప్లేను కలిగి ఉంటుంది. అదే పూర్తిగా మడత తీసినప్పుడు 10 ఇంచుల ట్యాబ్‌లా మారుతుంది. కనుక ఈ డివైస్‌ను ఫోన్, ట్యాబ్లెట్ లుగా 2 ఇన్ 1 గా ఉపయోగించుకోవచ్చు. ఈ ఫోన్ సింగిల్ డిస్ప్లే 6.5 ఇంచుల సైజ్‌లో ఉంటుంది. దీన్ని డైనమిక్ అమోలెడ్ ప్యానెల్‌తో రూపొందించారు. ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్‌ను కలిగి ఉంటుంది.
ఈ ఫోన్‌ను సూర్యకాంతిలోనూ స్పష్టంగా వీక్షించగలిగేలా దీనికి 2600 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ ఫీచర్ ను అందిస్తున్నారు. ఈ ఫోన్‌ను పూర్తిగా తెరిచినప్పుడు వచ్చే డిస్ప్లే 10 ఇంచుల సైజులో ఉంటుంది. దీన్ని కూడా డైనమిక్ అమోలెడ్ ప్యానెల్‌తో రూపొందించడం విశేషం. ఇది క్యూఎక్స్‌జీఏ ప్లస్ హై క్వాలిటీ రిజల్యూషన్‌ను కలిగి ఉంటుంది. కనుక డిస్ ప్లే పై అద్భుతమైన దృశ్యాలను వీక్షించవచ్చు. ఇది 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను సైతం కలిగి ఉండడం విశేషం. ఈ ఫోన్‌ను మూడు సార్లు మడతబెట్టినా కూడా చాలా స్లిమ్‌గా ఉంటుంది. కనుక చేతిలో పట్టుకుంటే హెవీగా ఉందనే భావన కలగదు. పూర్తిగా మడతబెట్టినప్పుడు 12.9 ఎంఎం మందాన్ని కలిగి ఉంటుంది. అదే పూర్తిగా మడత తీస్తే కేవలం 3.9 ఎంఎం మందాన్ని మాత్రమే కలిగి ఉంటుంది. కనుక ఫోన్ చాలా స్లిమ్‌గా ఉంటుందని చెప్పవచ్చు.
ఈ ఫోన్ కాస్త బరువు ఎక్కువగానే ఉంటుంది. ఏకంగా 309 గ్రాముల బరువు ఉంటుందని కంపెనీ చెబుతోంది. అయితే మార్కెట్లో అందుబాటులో ఉన్న చాలా వరకు 10 ఇంచుల ట్యాబ్‌ల కన్నా తక్కువ బరువే కలిగి ఉంటుందని కంపెనీ చెబుతోంది. కనుక దీన్ని ట్యాబ్‌లాగా వాడితే చాలా తేలిగ్గా ఉంటుంది. ఈ ఫోన్‌కు ముందు వైపు గొరిల్లా గ్లాస్ సెరామిక్ 2 ప్రొటెక్షన్‌ను ఏర్పాటు చేయగా, వెనుక వైపు సెరామిక్ గ్లాస్ రీఇన్ఫోర్స్డ్ పాలిమర్ ప్రొటెక్షన్‌ను అందిస్తున్నారు. కనుక ఫోన్ బిల్డ్ క్వాలిటీ చాలా దృఢంగా ఉంటుంది. ఈ ఫోన్ అల్యూమినియం ఫ్రేమ్‌ను కలిగి ఉంది. ఐపీ48 డస్ట్ అండ్ వాటర్ ప్రొటెక్షన్‌ను సైతం దీనికి అందిస్తున్నారు. ఈ ఫోన్ కు 200 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాను వెనుక వైపు ఇచ్చారు. అలాగే 12 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ కెమెరా కూడా వెనుక వైపు ఉంది. మరో 10 మెగాపిక్సల్ టెలిఫొటో లెన్స్‌ను ఇచ్చారు. దీని సహాయంతో 3ఎక్స్ ఆప్టికల్ జూమ్‌ను, 30ఎక్స్ డిజిటల్ జూమ్‌ను పొందవచ్చు. దీన్నే స్పేస్ జూమ్ ఫీచర్‌గా శాంసంగ్ చెబుతోంది.
ఈ ఫోన్‌కు ముందు వైపు రెండు 10 మెగాపిక్సల్ కెమెరాలను ఇచ్చారు. ఒకటి కవర్ స్క్రీన్‌పై ఉంటుంది. మరొకటి ప్రధాన అంతర్గత డిస్ప్లే ముందు వైపు ఉంటుంది. ఈ ఫోన్లో లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ మొబైల్ ప్లాట్ ఫామ్‌ను ఇచ్చారు. 16జీబీ ర్యామ్ లభిస్తుంది. 512జీబీ, 1టీబీ స్టోరేజ్ ఆప్షన్లలో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. ఈ ఫోన్లో 5600 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేశారు. దీనికి 45 వాట్ల ఫాస్ట్ చార్జింగ్కు సపోర్ట్‌ను అందిస్తున్నారు. అందువల్ల ఫోన్‌ను వేగంగా చార్జింగ్ చేసుకోవచ్చు. 30 నిమిషాల్లో 0 నుంచి 50 శాతం వరకు చార్జింగ్ పూర్తవుతుంది. అలాగే 15 వాట్ల ఫాస్ట్ వైర్లెస్ చార్జింగ్కు సైతం ఇందులో సపోర్ట్‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్లో 5జి సేవలను పొందవచ్చు. వైఫై 7, బ్లూటూత్ 5.4 వంటి అదనపు సదుపాయాలను సైతం ఇందులో అందిస్తున్నారు. ఇక ఈ ఫోన్ ధర 2445 డాలర్లు (సుమారుగా రూ.2.19 లక్షలు)గా ఉంది. ప్రస్తుతం ఈ ఫోన్ ను దక్షిణ కొరియా మార్కెట్లో విక్రయించనున్నారు. డిసెంబర్12 నుంచి అందుబాటులోకి వస్తుంది. తరువాత చైనా, తైవాన్, సింగపూర్, యూఏఈ, అమెరికా మార్కెట్లలో విక్రయిస్తారు. అయితే భారత్‌లో ఈ ఫోన్ విడుదలపై శాంసంగ్ ఎలాంటి ప్రకటన చేయలేదు.