Samsung Galaxy Book 4 Edge 15 | ప్రస్తుతం అంతా ఏఐ యుగం నడుస్తోంది. అందులో భాగంగానే స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలతోపాటు ల్యాప్ టాప్ తయారీదారులు కూడా ఏఐ ఫీచర్లను అందించేందుకు పోటీ పడుతున్నారు. ఇదే కోవలో శాంసంగ్ కూడా ఓవైపు ఏఐ ఫీచర్లు కలిగిన ఫోన్లను రిలీజ్ చేయడంతోపాటు ల్యాప్ టాప్‌లపై కూడా దృష్టి సారించింది. అందులో భాగంగా లేటెస్ట్గా ఓ నూతన ఏఐ ల్యాప్ టాప్‌ను రిలీజ్ చేసింది. గెలాక్సీ బుక్ 4 ఎడ్జ్ 15 పేరిట ఓ నూతన ల్యాప్ టాప్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఇందులో ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. ధర కూడా తక్కువగానే ఉండడం విశేషం. ఈ ల్యాప్‌టాప్‌లో క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ ఎక్స్ ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. గతంలో గెలాక్సీ బుక్ 4 ఎడ్జ్ 14, 16 ఇంచ్ మోడల్స్‌ను శాంసంగ్ లాంచ్ చేయగా, ఇప్పుడు 15 ఇంచ్ మోడల్లో ఈ ల్యాప్ టాప్‌ను ఏఐ ఫీచర్లతో లాంచ్ చేసింది. గతంలో వచ్చిన ల్యాప్ టాప్లలో స్నాప్ డ్రాగన్ ఎక్స్ ఎలైట్ ప్రాసెసర్లను ఏర్పాటు చేయడం గమనార్హం.
గెలాక్సీ బుక్ 4 ఎడ్జ్ 15 ల్యాప్ టాప్ లో 15 ఇంచుల ఐపీఎస్ యాంటీ గ్లేర్ డిస్ ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి ఫుల్ హెచ్డీ రిజల్యూషన్ లభిస్తుంది. అందువల్ల డిస్ ప్లే క్వాలిటీగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ ల్యాప్ టాప్‌ను చాలా స్లిమ్‌గా, తక్కువ బరువు ఉండేలా డిజైన్ చేశారు. రీసైకిల్డ్ ప్లాస్టిక్స్, గ్లాస్, అల్యూమినియంతో రూపొందించారు. అందువల్ల చాలా తక్కువ బరువు ఉన్నప్పటికీ అద్భుతమైన ప్రదర్శనను ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ ల్యాప్ టాప్‌లో వైఫై 7 కనెక్టివిటీని అందిస్తున్నారు. 1080పి హెచ్డీ కెమెరా కూడా ఉంది. ఇందులో 61.2 వాట్ అవర్ బ్యాటరీ ఉండా, దీనికి 65 వాట్ల యూఎస్బీ టైప్ సి చార్జింగ్‌ను అందిస్తున్నారు. అందువల్ల ల్యాప్ టాప్ చాలా వేగంగా చార్జింగ్ అవుతుంది. 27 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తుందని కంపెనీ చెబుతోంది.
ఈ ల్యాప్‌టాప్‌లో విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ లభిస్తుంది. శాంసంగ్ నాక్స్ సెక్యూరిటీని ఈ ల్యాప్‌టాప్‌లో అందిస్తున్నారు కనుక ల్యాప్ టాప్ హ్యాకర్ల నుంచి సురక్షితంగా ఉంటుంది. ఈ ల్యాప్ టాప్‌లో ప్రధాన ఆకర్షణ ఇందులో అందిస్తున్న ఏఐ ఫీచర్లే అని చెప్పవచ్చు. దీంట్లో మైక్రోసాఫ్ట్ కోపైలట్ ప్లస్ ఏఐ టూల్స్‌ను అందిస్తున్నారు. రీకాల్, లైవ్ ట్రాన్స్‌లేట్, కోక్రియేటర్ వంటి ఏఐ టూల్స్‌తోపాటు శాంసంగ్ ఏఐ టూల్ అయిన గెలాక్సీ ఏఐ కూడా ఇందులో లభిస్తుంది. ముఖ్యంగా చాట్ అసిస్ట్ అనే ఫీచర్‌ను అందిస్తున్నారు. మైక్రోసాఫ్ట్ ఫోన్ లింక్ సదుపాయం కూడా ఉంది. దీని సహాయంతో యూజర్లు తమ ఆండ్రాయిడ్ ఫోన్లను ఈ ల్యాప్‌టాప్‌కు చాలా సులభంగా కనెక్ట్ చేసుకుని స్క్రీన్ మిర్రరింగ్ చేసుకోవచ్చు. అలాగే ఒక డివైస్‌లో ఉన్న ఫైల్స్‌ను మరొక డివైస్‌లో సులభంగా యాక్సెస్ చేసుకోవచ్చు.
ఈ ల్యాప్‌టాప్‌లో 16జీబీ ర్యామ్ లభిస్తుంది. 512జీబీ స్టోరేజ్‌ను అందిస్తున్నారు. డాల్బీ అట్మోస్ ఆడియోకు సపోర్ట్ ఉంది. అందువల్ల ఆడియో చాలా క్వాలిటీగా ఉంటుంది. హెచ్డీఎంఐ, యూఎస్బీ 3.2, మైక్రోఎస్డీ రీడర్, హెడ్‌ఫోన్, మైక్ జాక్, ఫింగర్ ప్రింట్ రీడర్ వంటి అదనపు సదుపాయాలు కూడా ఇందులో ఉన్నాయి. గెలాక్సీ బుక్ 4 ఎడ్జ్ 15 ల్యాప్ టాప్‌ను ఆర్కిటిక్ బ్లూ కలర్ ఆప్షన్లో మాత్రమే లాంచ్ చేశారు. ఈ ల్యాప్ టాప్ ధర రూ.64,990గా ఉంది. దీనిపై రూ.5వేల వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చు. శాంసంగ్ ఇండియా ఆన్లైన్ స్టోర్‌తోపాటు ఫ్లిప్‌కార్ట్, శాంసంగ్ షాప్ యాప్, శాంసంగ్ ఎక్స్‌పీరియెన్స్ స్టోర్స్, ఇతర రిటెయిల్ స్టోర్స్‌లో ఈ ల్యాప్‌టాప్‌ను విక్రయిస్తున్నారు.