న్యూయార్క్: ఇంటిపై సోలార్ ప్యానెళ్లు.. దాని నుంచి వచ్చే కరెంటు మొత్తం ఇంటి గోడల్లో నిల్వ.. సిమెంట్ రోడ్లపై రయ్‌మని దూసుకుపోయే ఎలక్ట్రిక్ కార్లు.. రోడ్డుపై వెళ్తుండగానే.. అదే రోడ్డు నుంచి బ్యాటరీలు రీచార్జ్ చేసుకోవటం.. ఏంటిదంతా అనుకొంటున్నారా? భవిష్యత్తులో అందుబాటులోకి రాబోయే టెక్నాలజీ ఇదేనట.. ప్రస్తుతం విద్యుత్తును నిల్వచేసేందుకు లిథియం ఆయాన్ తదితర బ్యాటరీలను వాడుతున్నాం కదా.. భవిష్యత్తులో వీటి అవసరమే ఉండదట. కాంక్రీట్ దిమ్మెలే బ్యాటరీలుగా పనిచేస్తాయని బల్లగుద్ది చెప్తున్నారు మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) పరిశోధకులు.
అమెరికాకు చెందిన ఈ ప్రఖ్యాత సంస్థ విస్ ఇన్స్టిట్యూట్తో కలిసి భారీ స్థాయిలో విద్యుత్తును నిల్వచేసే సాంకేతికతను అభివృద్ధి చేసినట్టు ప్రకటించింది. మనం ఇల్లు కట్టుకోవటానికి వాడే సిమెంట్‌కు ప్రాచీన కాలం నుంచి వినియోగిస్తున్న కార్బన్ బ్లాక్ అనే రంగును (కలర్) జతచేసి నీటితో గట్టిపరిచినప్పుడు అది భారీగా విద్యుత్తును నిల్వచేయగల సూపర్ కెపాసిటర్‌గా పనిచేస్తుందని ఎంఐసీ ప్రొఫెసర్ అడ్మిర్ మాసిక్ తెలిపారు. అంటే మనం ఇల్లు కట్టుకొనేటప్పుడు పిల్లర్లు, గోడలకు వాడే సిమెంట్‌లో కార్బన్ బ్లాక్ సిమెంట్‌ను కలుపుకొంటే చాలు ఇల్లంతా పెద్ద బ్యాటరీగా మారిపోతుంది. అలాగే సిమెంట్లు రోడ్లు వేసేటప్పుడు అందులో ఈ రంగును కలిపితే రోడ్డంతా బ్యాటరీగా మారిపోతుంది.
వీటి నుంచి ఎప్పుడైనా ఆ విద్యుత్తును అన్ని అవసరాలకు వాడుకోవచ్చు అని మాసిక్ వెల్లడించారు. ‘ఈ పదార్థం అద్భుతమైనది. ఎందుకంటే ప్రపంచంలో మనం అత్యధికంగా, విరివిగా వాడే పదార్థం సిమెంటే. చారిత్రకంగా ఎంతో ప్రసిద్ధిచెందిన కార్బన్ బ్లాక్ కలర్‌ను సిమెంటుకు ఒక పద్ధతి ప్రకారం కలిపితే చాలు. అది నానో కాంపోజిట్గా మారుతుంది. ఈ సిమెంట్, కార్బన్ బ్లాక్ కలర్‌ను కలిపేందుకు నీరు మాత్రమే అవసరం. అంటే చాలా తక్కువ ఖర్చుతోనే భారీ మొత్తంలో విద్యుత్తును నిల్వచేయగల పదార్థం తయారవుతుంది. అంతేకాదు ప్రస్తుతం ఉన్న సోలార్, విండ్, టైడల్ విద్యుత్తులో ఉన్న హెచ్చుతగ్గులను ఈ పవర్ స్టోరేజ్ టెక్నాలజీతో స్థిరీకరించవచ్చు’ అని వివరించారు.