అంతరిక్షంలో మనం ఊహించని చాలా ప్రమాదాలు ఉంటాయి. వాటిలో గ్రహశకలాలు ముఖ్యమైనవి. ఇవి ఎప్పుడు ఎక్కడి నుంచి వస్తాయో అంచనా వేయడం చాలా కష్టం. ఇప్పుడు తాజాగా తీవ్రమైన నష్టం కలిగించగలిగే ఒక గ్రహశకలం భూమి వైపు దూసుకొస్తోందని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) వెల్లడించింది.
ఇది 450 మీటర్ల వెడల్పు ఉంటుందిట. మిగతా గ్రహశకలాలతో పోలిస్తే దీని సైజు అంత భయపడాల్సినది కాదని శాస్త్రవేత్తలు అంటున్నారు. అయితే ఇది ప్రయాణించే వేగం ప్రమాదకరంగా ఉందని తెలిపారు. ఈ గ్రహశకలం అంతరిక్షలం ఏకంగా గంటకు 49,513.45 కిలోమీటర్ల వేగంతో భూమి వైపు దూసుకొస్తోంది. ఇది గనుక భూమిపై పడితే చాలా నష్టం జరుగుతుంది.
అందుకే దీన్ని ‘‘పొటెన్షియల్లీ హజార్డస్’’ (ప్రమాదకరమైన) గ్రహశకలాల జాబితాలో నాసా చేర్చింది. ఆస్టరాయిడ్ 2013బీవో76 అని పిలిచే ఇది.. ఈసారి భూమికి 51 ,11,759 కిలోమీటర్ల దూరం నుంచి దూసుకుపోతుందని, భూమిపై ఎటువంటి ప్రభావమూ చూపబోదని సైంటిస్టులు చెప్తున్నారు. గురువారం నాడు ఈ గ్రహశకలం భూమిని దాటేస్తుందట.
అయితే ఇది ఇలా మన భూమి సమీపంలోకి రావడం ఇదేమీ తొలిసారి కాదు. 2013లో కూడా ఇలాగే భూమి వైపు దూసుకొచ్చిన ఈ ఆస్టరాయిడ్.. అప్పుడు 78,88,295 కిలోమీటర్ల దూరం నుంచి వెళ్లిపోయింది. ఇదే గ్రహశకలం మరోసారి 2033 జులై 14న భూమి దగ్గరకు వస్తుందని, అప్పుడు భూమి నుంచి 1.91 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి ఇది ప్రయాణిస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.