OPPO K13 5G | టెక్నాలజీ రంగంలో ఏఐ చేస్తున్న అద్భుతాలు అన్నీ ఇన్నీ కావు. గత 1-2 సంవత్సరాల ముందు వరకు ఏఐ అంటే కేవలం పీసీల్లోనే అందుబాటులో ఉండేది. కానీ ఇప్పుడు ఫోన్లలోనూ అందుబాటులోకి వచ్చింది. ఏఐ సహాయంతో పనిచేసే అనేక యాప్‌లను కంపెనీలు అందిస్తున్నాయి. అలాగే ఏఐ ఫీచర్లు కలిగిన ఫోన్లను కూడా కంపెనీలు తయారు చేసి చాలా తక్కువ ధరలకే అందిస్తున్నాయి. దీంతో ప్రస్తుతం ఏఐ ఫోన్లకు డిమాండ్ బాగా పెరిగిందని చెప్పవచ్చు. అందులో భాగంగానే ఒప్పో కూడా లేటెస్ట్గా ఏఐ ఫీచర్లు కలిగిన ఓ నూతన ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఒప్పో కె13 5జి పేరిట లాంచ్ అయిన ఈ ఫోన్లో పలు ఆకట్టుకునే ఫీచర్లతోపాటు ఏఐ ఫీచర్లను కూడా అందిస్తున్నారు.
ఒప్పో కె13 5జి స్మార్ట్ ఫోన్లో 6.67 ఇంచుల డిస్ప్లేను ఏర్పాటు చేయగా దీనికి ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్ లభిస్తోంది. అమోలెడ్ డిస్ప్లే కావడం, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుండడంతో ఈ డిస్ప్లే అత్యంత నాణ్యంగా ఉంటుంది. డిస్ప్లేపై నాణ్యమైన దృశ్యాలను వీక్షించవచ్చు. కె సిరీస్‌లో ఒప్పో లాంచ్ చేసిన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ఇదే కాగా ఇందులో 1200 నిట్స్ వరకు పీక్ బ్రైట్ నెస్ ఫీచర్ లభిస్తోంది. అలాగే ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 6 జెన్ 4 ప్రాసెసర్‌ను ఇందులో ఏర్పాటు చేశారు. ఈ ఫోన్ 8జీబీ ర్యామ్‌ను కలిగి ఉంది. ఇందులో ప్రత్యేక గ్రాఫైట్ షీట్ కూలింగ్ ఫీచర్‌ను అందిస్తున్నారు. అందువల్ల ఫోన్లో గేమ్స్ ఆడేటప్పుడు లేదా వీడియోలను చూసేటప్పుడు ఫోన్ ఎక్కువగా హీట్‌కు గురికాకుండా ఉంటుంది. ఈ ఫోన్లో వెనుక వైపు 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉండగా, మరో 2 మెగాపిక్సల్ సెకండరీ కెమెరాను కూడా ఇచ్చారు.
ఈ ఫోన్లో ఉన్న కెమెరాలకు ఏఐ ఫీచర్లను అందిస్తున్నారు. ఏఐ క్లారిటీ ఎన్హాన్సర్, ఏఐ అన్ బ్లర్, ఏఐ రిఫ్లెక్షన్ రిమూవర్, ఏఐ ఎరేజర్ వంటి ఏఐ ఫీచర్లను అందిస్తున్నారు. ఈ ఫోన్లోఐఆర్ బ్లాస్టర్ కూడా ఉంది. అందువల్ల ఫోన్‌ను రిమోట్‌గా కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేసే కలర్ ఓఎస్ 15ను కలిగి ఉంది. ఈ ఫోన్‌కు గాను 2 ఓఎస్ అప్డేట్స్ను, 3 ఏళ్ల వరకు సెక్యూరిటీ అప్డేట్స్ను అందిస్తామని కంపెనీ తెలియజేసింది. గేమ్స్ ఎక్కువగా ఆడేవారి కోసం ఈ ఫోన్లో ప్రత్యేక ఫీచర్లను అందించినట్లు కంపెనీ తెలియజేసింది. ఈ ఫోన్లో ఏఐ లింక్ బూస్ట్ 2.0 అనే టెక్నాలజీని అందిస్తున్నారు. అందువల్ల సిగ్నల్ సరిగ్గా లేని ప్రాంతాల్లోనూ ఈ ఫోన్ ద్వారా కాల్స్‌ను క్వాలిటీగా చేసుకోవచ్చు.
ఈ ఫోన్లో ఏకంగా 7000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేశారు. దీనికి 80 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్‌ను అందిస్తున్నారు. అందువల్ల ఫోన్ 0 నుంచి 62 శాతం చార్జింగ్ అయ్యేందుకు 30 నిమిషాల సమయమే పడుతుంది. ఈ ఫోన్ బ్యాటరీ అత్యంత మన్నికగా ఉంటుందని కంపెనీ తెలియజేసింది. కనీసం 5 ఏళ్లు ఈ ఫోన్‌ను ఉపయోగించినా 80 శాతం వరకు బ్యాటరీ లైఫ్ మిగిలి ఉంటుందని తెలియజేసింది. 128జీబీ, 256 జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. డ్యుయల్ సిమ్‌లను వేసుకోవచ్చు. ముందు భాగంలో 16 మెగాపిక్సల్ కెమెరా ఉంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఇచ్చారు. యూఎస్బీ టైప్ సి ఆడియోను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ఐపీ 65 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ ఫీచర్ కూడా ఉంది. 5జి ని ఉపయోగించుకోవచ్చు. డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్ 5.2, యూఎస్బీ టైప్ సి వంటి ఇతర ఫీచర్లు కూడా ఈ ఫోన్లో ఉన్నాయి.
ఒప్పో కె13 5జి స్మార్ట్ ఫోన్‌కు చెందిన 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.17,999 ఉండగా, 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.19,999గా ఉంది. ఫ్లిప్‌కార్ట్‌తోపాటు ఒప్పో ఇండియా ఆన్లైన్ స్టోర్స్, ఇతర ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో ఈ ఫోన్‌ను ఏప్రిల్ 25వ తేదీ నుంచి విక్రయించనున్నారు. లాంచింగ్ సందర్భంగా ఈ ఫోన్‌ను ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీ బ్యాంకు కార్డులతో కొనుగోలు చేసిన వారికి రూ.1000 ఇన్ స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. మరో రూ.1000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌ను కూడా పొందవచ్చు. అలాగే 6 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా ఉంది.