Ola S1 Pro Sport | ఓలా ఎలక్ట్రిక్ భారత్‌లో మరో నూతన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేసింది. ఎస్1 ప్రొ స్పోర్ట్ పేరిట ఈ స్కూటర్‌ను మార్కెట్లో రిలీజ్ చేశారు. సంకల్ప్ 2025 ఈవెంట్లో భాగంగా ఈ స్కూటర్‌ను లాంచ్ చేసినట్లు ఓలా ఎలక్ట్రిక్ తెలియజేసింది. ఆల్ రౌండర్, ఆల్ స్పోర్ట్ స్కూటర్‌గా సదరు కంపెనీ దీన్ని అభివర్ణించింది. ఈ స్కూటర్‌ను డైనమిక్, ఎరో డైనమిక్ ప్రొఫైల్‌తో స్పోర్టీ యాక్సెంట్స్‌లో డిజైన్ చేశారు. అగ్రెసివ్ వింగ్స్, కార్బన్ ఫైబర్ స్లిప్‌స్ట్రీమ్ గ్రాబ్ హ్యాండిల్ ఉంది. అందువల్ల స్కూటర్‌కు ప్రీమియం లుక్ వచ్చింది. ఈ స్కూటర్‌ను గ్లాసీ, మ్యాట్ వేరియెంట్లలో 6 కలర్ షేడ్స్‌లో లాంచ్ చేశారు. పోర్సెలెయిన్ వైట్, జెట్ బ్లాక్, సిల్వర్, ప్యాషన్ రెడ్, స్టెల్లార్ బ్లూ, మిడ్ నైట్ బ్లూ కలర్ ఆప్షన్లలో ఈ స్కూటర్‌ను లాంచ్ చేశారు.
ఓలా ఎస్1 ప్రొ స్పోర్ట్ స్కూటర్‌కు కార్బన్ ఫైబర్ ఫ్రంట్ ఫెండర్‌ను ఇచ్చారు. సీట్‌ను మరింత అధునాతనంగా తీర్చిదిద్దారు. కాంపాక్ట్ విండ్ స్క్రీన్ కూడా ఉంది. స్పోర్ట్ ఓరియెంటెడ్ యాప్రాన్‌ను ఇచ్చారు. ఈ స్కూటర్‌కు వెక్టార్ ఫ్లో వెంట్స్ అనే ఫీచర్‌ను అందిస్తున్నారు. అందువల్ల ఎయిర్ ఫ్లో సరిగ్గా ఉంటుంది. రైడర్ మరింత సౌకర్యవంతంగా వాహనాన్ని నడిపించవచ్చు. ఈ స్కూటర్‌కు వర్టికల్ స్ట్రైప్స్‌తోపాటు షార్ప్ ఎడ్జ్‌లను ఇచ్చారు. మొత్తం ఎల్ఈడీ లైటింగ్ ఉంటుంది. అందువల్ల స్కూటర్ కు మరింత ప్రీమియం లుక్ వచ్చింది. ఈ స్కూటర్లో 13 కిలోవాట్ల ఫెర్రైట్ మోటార్‌ను ఇచ్చారు. 16 కిలోవాట్ల పీక్ పవర్‌ను, 71ఎన్ఎం టార్క్‌ను అందిస్తుంది. ఈ స్కూటర్ 2 సెకన్లలోనే గంటకు 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. గంటకు గరిష్టంగా 152 కిలోమీటర్ల వేగంతో దీన్ని నడిపించవచ్చు.
ఇందులో 5.2 కిలోవాట్ అవర్ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఇచ్చారు. ఓలాకు చెందిన సొంత 4680 భారత్ సెల్స్ ఈ బ్యాటరీలో ఉన్నాయి. ఒక్కసారి ఈ బ్యాటరీని ఫుల్ చార్జింగ్ చేస్తే ఏకంగా 320 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు. ఈ స్కూటర్లోనే 4 కిలోవాట్ అవర్ కెపాసిటీ ఉన్న బ్యాటరీతో ఇంకో ఆప్షన్ వేరియెంట్‌ను కూడా అందిస్తున్నారు. భారత్ సెల్స్‌ను ఓలా సొంతంగా తయారు చేయగా ఇవి డ్రై ఎలక్ట్రోడ్ లిథియం అయాన్ సెల్స్ కావడం విశేషం. అందువల్ల ఇవి ఇతర బ్యాటరీ సెల్స్ కన్నా ఎక్కువ కెపాసిటీని కలిగి ఉండడంతోపాటు ఎక్కువ రోజుల పాటు మన్నికగా పనిచేస్తాయి కూడా. అలాగే ఇతర బ్యాటరీల కన్నా ఎక్కువ వేగంగా చార్జింగ్ అవుతాయని ఓలా తెలియజేసింది. ఈ స్కూటర్లో ఉన్న బ్యాటరీని 20 నుంచి 80 శాతం చార్జింగ్ అయ్యేందుకు కేవలం 15 నిమిషాల పాటు చార్జ్ చేస్తే చాలని ఓలా చెబుతోంది.
ఇక ఓలా ఎస్1 ప్రొ స్పోర్ట్ స్కూటర్లో అధునాతన సేఫ్టీ సిస్టమ్స్‌ను సైతం ఏర్పాటు చేశారు. ఎదురుగా వచ్చే వాహనాలను ఢీకొట్టే విధంగా ఉంటే ముందుగానే పసిగట్టే ఏడీఏఎస్ కెమెరాను ఏర్పాటు చేశారు. ఇది వాహనదారుడికి ఈ విషయంపై ముందుగా అలర్ట్ పంపిస్తుంది. అలాగే బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, అడాప్టిల్ క్రూయిజ్ కంట్రోల్, ట్రాఫిక్ సైన్ రికగ్నిషన్, స్పీడ్ వార్నింగ్, డ్యాష్ క్యామ్, ఏబీఎస్ వంటి ఫీచర్లను సైతం ఈ స్కూటర్లో అందిస్తున్నారు. మూవ్ ఓఎస్ 6 ప్లాట్ ఫామ్ ఆధారంగా ఈ స్కూటర్ పనిచేస్తుంది. ఇందులో వాయిస్ అసిస్టెంట్, స్మార్ట్ చార్జింగ్, ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్, కస్టమ్ రైడ్ మోడ్స్ వంటి ఫీచర్లను పొందవచ్చు. 7 ఇంచుల టచ్ స్క్రీన్ డిస్ప్లే ఉంది. ఇందులో నావిగేషన్, డేంజర్ అలర్ట్స్, ఏఆర్ హెల్మెట్ సపోర్ట్ వంటి ఫీచర్లు లభిస్తున్నాయి. ఇక ఈ స్కూటర్‌కు చెందిన 4 కిలోవాట్ అవర్ మోడల్ ధర రూ.1.50 లక్షలు ఉండగా, 5.2 కిలోవాట్ అవర్ మోడల్ ధర రూ.1.65 లక్షలుగా ఉంది. ఈ స్కూటర్లకు గాను కేవలం రూ.999 చెల్లించి కస్టమర్లు ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు. జనవరి 2026లో ఈ స్కూటర్లను మార్కెట్లో విక్రయిస్తారు.