మొబైల్ ఫోన్ మార్కెట్లో ఏస్ బ్రాండ్‌గా ఉన్న కొరియన్ కంపెనీ సామ్సంగ్ కొత్త మార్కెట్‌పై ప్రత్యేక దృష్టిపెట్టింది. స్మార్ట్‌ఫోన్ వ్యాపారంలో పురోగతి సాధించాలనే లక్ష్యం పెట్టుకున్న ఈ టెక్ దిగ్గజం వచ్చే నెలలో తమ సరికొత్త ఫోల్డెబుల్ స్మార్ట్‌ఫోన్ సిరీస్ (మడతపెట్టే ఫోన్)ను ఆవిష్కరిస్తామని బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. నెక్ట్స్ జనరేషన్ ఫోల్డెబుల్ స్మార్ట్ఫోన్లు గెలాక్సీ జడ్ ఫ్లిప్ 4, గెలాక్సీ జడ్ ఫోల్డ్ 4ను ఆగస్టు 10న జరుగనున్న గెలాక్సీ అన్ప్యాక్డ్ ఆన్లైన్ ఈవెంట్ ‘అన్ఫోల్డ్ యువర్ వరల్డ్’లో ప్రదర్శిస్తారని భావిస్తున్నారు.
కాగా, బుధవారం విడుదల చేసిన ఈవెంట్ టీజర్ ప్రోమో వీడియో రాబోయే ఫోన్ల స్పెసిఫికేషన్ల గురించి ఏమీ చెప్పలేదు. క్లామ్‌షెల్ శైలి గెలాక్సీ జడ్ ఫ్లిప్ 4 లో ఏడాది క్రితం వచ్చిన దాని మునుపటి మోడల్లో రెండు భాగాలను కలిపే కీలు కంటే ఇంకాస్త స్లిమ్‌గా ఉన్నట్లు యోన్హాప్ వార్తా సంస్థ నివేదించింది. రెండో త్రైమాసికంలో సామ్సంగ్ స్మార్ట్‌ఫోన్ షిప్మెంట్లు సుమారు 61 మిలియన్ యూనిట్లుగా అంచనా వేశారు. ఇది గత త్రైమాసికంతో పోలిస్తే 16 శాతం తగ్గింది. ఇదిలా ఉండగా, త్వరలోనే ఆపిల్ కూడా ఫోల్డెబుల్ ఫోన్ల మార్కెట్లోకి ప్రవేశించనున్నట్లు తెలిసింది.