iPhone 17 Pro | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తాజాగా నిర్వహించిన తన ఈవెంట్లో ఐఫోన్ 17 ఫోన్‌తోపాటు అత్యంత స్లిమ్ డిజైన్ కలిగిన ఐఫోన్ ఎయిర్ ఫోన్‌ను కూడా లాంచ్ చేసింది. అయితే వీటితోపాటు ప్రొ సిరీస్‌లో మరో రెండు ఐఫోన్లను కూడా లాంచ్ చేశారు. ఐఫోన్ 17 ప్రొ, 17 ప్రొ మ్యాక్స్ పేరిట ఈ ఫోన్లను విడుదల చేశారు. ఈ రెండు ఫోన్లు టైటానియం డిజైన్‌ను కలిగి ఉన్నాయి. రెండింటిలోనూ ఎ19 ప్రొ ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. 17 ప్రొ ఫోన్ 6.3 ఇంచుల డిస్ప్లేను కలిగి ఉండగా, 17 ప్రొ మ్యాక్స్‌లో 6.9 ఇంచుల డిస్ప్లేను ఏర్పాటు చేశారు. రెండు ఫోన్ల డిస్ప్లేలకు ప్రొ మోషన్ ఫీచర్ లభిస్తుంది. అలాగే 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. అందువల్ల డిస్ప్లేల క్వాలిటీ అద్భుతంగా ఉంటుంది. అద్భుతమైన దృశ్యాలను వీక్షించవచ్చు. ఈ డిస్ప్లేలకు 3000 నిట్స్ వరకు పీక్ బ్రైట్ నెస్‌ను అందిస్తున్నారు. కనుక సూర్యకాంతిలోనూ స్పష్టంగా చూడవచ్చు.
ఈ ఫోన్లలో ఏర్పాటు చేసిన యాపిల్ ఎ19 ప్రొ ప్రాసెసర్ గత ఐఫోన్లలోని ప్రాసెసర్ల కన్నా అత్యంత వేగంగా పనిచేస్తుందని యాపిల్ తెలియజేసింది. గతంలో వచ్చిన ఐఫోన్లలోని ఎ18 ప్రొ కన్నా ఎ19 ప్రొ ప్రాసెసర్ చాలా వేగంగా ఉంటుందని స్పష్టం చేసింది. ఈ ఫోన్లలో ప్రత్యేకంగా ఎన్1 పేరిట ఓ నెట్వర్కింగ్ చిప్‌ను ఇచ్చారు. దీని సహాయంతో వైఫై 7, బ్లూటూత్ 6 సేవలను ఉపయోగించుకోవచ్చు. ఇవి యూజర్లకు అత్యుత్తమ కనెక్టివిటీని ఇస్తాయి. ఐఫోన్ 17 ప్రొ ఫోన్లలో వెనుక వైపు 48 మెగాపిక్సల్ కెపాసిటీ కలిగిన ట్రిపుల్ కెమెరాలను ఇచ్చారు. అందులో ఒకటి 48 మెగాపిక్సల్ ఫ్యుషన్ కెమెరా కాగా మరొకటి 48 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్‌గా ఉంది. అలాగే మరో 48 మెగాపిక్సల్ టెలిఫొటో కెమెరాను సైతం ఇచ్చారు. ఈ కెమెరా ద్వారా ఏకంగా 4ఎక్స్ ఆప్టికల్ జూమ్‌ను పొందవచ్చు. ముందు వైపు 18 మెగాపిక్సల్ సెంటర్ స్టేజ్ ఫ్రంట్ కెమెరా ఉంది.
ఐఫోన్ 17 ప్రొ సిరీస్ ఫోన్లను అల్యూమినియం యూనిబాడీ డిజైన్‌తో రూపొందించారు. కనుక ఫోన్లకు అద్భుతమైన ప్రీమియం లుక్ వచ్చింది. ఈ ఫోన్లకు కూడా ముందు వైపు సెరామిక్ షీల్డ్ ప్రొటెక్షన్‌ను ఇస్తున్నారు. ఈ ఫోన్లకు ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. 20 నిమిషాల్లోనే 50 శాతం చార్జింగ్ పూర్తవుతుంది. 40 వాట్ల వరకు ఫాస్ట్ చార్జింగ్కు సపోర్ట్ లభిస్తుంది. ఈ ఫోన్లను 256జీబీ, 512జీబీ, 1టీబీ, 2టీబీ స్టోరేజ్ ఆప్షన్లలో లాంచ్ చేశారు. ఐఓఎస్ 26 ఆపరేటింగ్ సిస్టమ్ లభిస్తుంది. ఐపీ 68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ ఫీచర్‌ను కూడా ఈ ఫోన్లలో పొందవచ్చు. డ్యుయల్ సిమ్‌లను వేసుకోవచ్చు. ఒకటి నానో సిమ్ కాగా ఒకటి ఇ-సిమ్గా పనిచేస్తుంది. రెండింటిలోనూ వేగవంతమైన 5జిని పొందవచ్చు. గిగాబిట్ ఎల్టీఈ, ఎన్ఎఫ్సీ వంటి సదుపాయాలు కూడా ఉన్నాయి. 25 వాట్ల వరకు వైర్ లెస్ ఫాస్ట్ చార్జింగ్కు సపోర్ట్ లభిస్తుంది.
ఐఫోన్ 17ప్రొ, 17 ప్రొ మ్యాక్స్ ఫోన్లను సిల్వర్, కాస్మిక్ ఆరెంజ్, డీప్ బ్లూ కలర్ ఆప్షన్లలో లాంచ్ చేశారు. ఈ ఫోన్లకు గాను 128జీబీ మోడల్‌ను అందించడం లేదు. 17 ప్రొ మ్యాక్స్ మోడల్ మాత్రం 2టీబీ స్టోరేజ్ ఆప్షన్లో లభిస్తుంది. ఇక ఈ ఫోన్లకు చెందిన ధరలు ఇలా ఉన్నాయి. ఐఫోన్ 17 ప్రొకు చెందిన 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.1,34,900 ఉండగా, 512జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.1,54,900గా ఉంది. అలాగే 1టీబీ మోడల్ ధరను రూ.1,74,900గా నిర్ణయించారు. ఇక ఐఫోన్ 17 ప్రొ మ్యాక్స్ ఫోన్‌కు చెందిన 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.1,49,900 ఉండగా, 512జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.1,69,900గా ఉంది. 1టీబీ స్టోరేజ్ మోడల్ ధరను రూ.1,89,900గా నిర్ణయించారు. 2టీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.2,29,900గా ఉంది. ఐఫోన్ 17 ప్రొ సిరీస్ ఫోన్లకు గాను ప్రీ ఆర్డర్లను సెప్టెంబర్ 12 నుంచి ప్రారంభించనుండగా, సెప్టెంబర్ 19 నుంచి ఈ ఫోన్లను మార్కెట్లో విక్రయించనున్నారు.