Infinix Smart 10 | ప్రస్తుతం చాలా మంది బడ్జెట్ ధరలోనే ఫోన్లను కొనాలని చూస్తున్నారు. వాటిల్లో ఆకర్షణీయమైన ఫీచర్లను కూడా కోరుకుంటున్నారు. అలాంటి వారి కోసమే కంపెనీలు కూడా పలు బడ్జెట్ ఫోన్లను రూపొందించి విడుదల చేస్తున్నాయి. అందులో భాగంగానే ఇన్ఫినిక్స్ కూడా ఓ బడ్జెట్ స్మార్ట్ ఫోన్‌ను రిలీజ్ చేసింది. ఇన్ఫినిక్స్ స్మార్ట్ 10 పేరిట ఈ ఫోన్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేశారు. ఈ ఫోన్ ధర తక్కువగా ఉండడమే కాదు, ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను సైతం అందిస్తున్నారు. ఈ ఫోన్లో 6.67 ఇంచుల డిస్ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. అందువల్ల డిస్ప్లే క్వాలిటీగా ఉంటుందని చెప్పవచ్చు.
ఈ ఫోన్లో డీటీఎస్ డ్యుయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. ఈ ఫోన్లో యూనిసోక్ టి7250 ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. 4జీబీ ర్యామ్ లభిస్తుంది. మరో 4జీబీ వరకు ర్యామ్‌ను అదనంగా వర్చువల్‌గా పెంచుకునే వీలు కల్పించారు. ఇందులో ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్‌ను 4 ఏళ్లపాటు ఎలాంటి లాగ్ లేకుండా వాడుకోవచ్చని కంపెనీ చెబుతోంది. అలాగే ఎల్లా ఏఐ అనే ఫీచర్‌ను సైతం అందిస్తున్నారు. ఇది పలు భారతీయ భాషల్లోనూ అందుబాటులో ఉండడం విశేషం. ఈ ఫోన్‌ను ఎంత తక్కువ సిగ్నల్ ఉన్నా కూడా నెట్ వర్క్ చక్కగా పనిచేసేలా రూపొందించారు. అంటే కాల్స్ మాట్లాడేటప్పుడు ఎలాంటి డ్రాప్స్ ఉండవు. ఇక ఈ ఫోన్లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఏర్పాటు చేయగా దీనికి 15 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌ను అందిస్తున్నారు. అందువల్ల ఫోన్‌ను వేగంగానే చార్జింగ్ చేసుకోవచ్చు.
64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఈ ఫోన్లో లభిస్తుంది. మైక్రో ఎస్డీ కార్డు ద్వారా మెమొరీని పెంచుకునే సదుపాయం అందిస్తున్నారు. ఈ ఫోన్లో రెండు సిమ్ కార్డులు, ఒక మైక్రో ఎస్డీ కార్డు వేసుకునేందుకు వీలుగా మొత్తం 3 స్లాట్లను ఇచ్చారు. వెనుక వైపు 8 మెగాపిక్సల్ కెమెరా ఉండగా, ముందు వైపు సైతం 8 మెగాపిక్సల్ కెమెరాను అందిస్తున్నారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ పక్క భాగంలో ఉంటుంది. ఇన్ ఫ్రారెడ్ సెన్సార్ కూడా లభిస్తుంది. 3.5ఎంఎం ఆడియో జాక్ ఉంది. స్టీరియో స్పీకర్లు ఏర్పాటు చేశారు. డీటీఎస్ ఆడియో ఫీచర్‌ను అందిస్తున్నారు. అందువల్ల సౌండ్ క్వాలిటీ బాగుంటుంది. ఎఫ్ఎం రేడియోను ఆస్వాదించవచ్చు. ఐపీ 64 డస్ట్ అండ్ స్ల్పాష్ రెసిస్టెన్స్ ఫీచర్ కూడా ఉంది. ఇక ఈ ఫోన్ లో 5జి లేదు. కేవలం 4జి మాత్రమే లభిస్తుంది. డ్యుయల్ 4జి వీవోఎల్టీఈని పొందవచ్చు. బ్లూటూత్ 5.2, యూఎస్బీ టైప్ సి వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
ఇన్ఫినిక్స్ స్మార్ట్ 10 స్మార్ట్ ఫోన్‌ను స్లీక్ బ్లాక్, టైటానియం సిల్వర్, ఐరిస్ బ్లూ, ట్విలైట్ గోల్డ్ కలర్ ఆప్షన్లలో లాంచ్ చేశారు. ఈ ఫోన్‌కు చెందిన సింగిల్ వేరియెంట్ 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.6,799గా ఉంది. ఈ ఫోన్‌ను ఇన్ఫినిక్స్ ఆన్లైన్ స్టోర్‌తోపాటు ఫ్లిప్‌కార్ట్‌లో ఆగస్టు 2 నుంచి విక్రయించనున్నారు.