Indonesia Old Artwork | సింబాలిక్ సంస్కృతి అంటే కళాకారులు, కళాప్రియులకు ముందుగా యూరోప్ గుర్తుకు వస్తుంది. మానవ సృజనాత్మకత, నైరూప్య కళ (అబ్స్ట్రాక్ట్ ఆర్ట్)కు యూరోప్ పుట్టినిల్లని చరిత్రకారులు, పురాతత్వ శాస్త్ర వేత్తలు చెబుతుంటారు. ఇప్పటికే ఎన్నో పరిశోధనలు, అధ్యయనాలు ఈ విషయాన్ని చూచాయగా వెల్లడించాయి కూడా. వాటికి సంబంధించిన ఆధారాలను కూడా గతంలో ఎన్నడో పురాతత్వ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కనుకనే ఆయా పదాలు లేదా పేర్లను చెబితే అందరికీ ఐరోపా గుర్తుకు వస్తుంది. అయితే దీన్ని చెరిపేసేలా ఓ పురాతన కళాకృతి ఇండోనేషియాలో బయట పడింది. దీని ప్రకారం ఇకపై సృజనాత్మకత లేదా సింబాలిక్ సంస్కృతి వంటి పేర్లను చెబితే యూరోప్ కాకుండా, ఇండోనేషియా గుర్తుకు వస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. అందులో భాగంగానే ఆ దేశంలో ఓ చోట అత్యంత పురాతన కళాకృతిని సైంటిస్టులు గుర్తించారు.
ఇండోనేషియాలోని సులవెసి దీవిలో ఉన్న లైమ్ స్టోన్ అనే గుహల్లో ఓ రాతిపై అత్యంత పురాతన కాలానికి చెందిన కళాకృతిని సైంటిస్టులు గుర్తించారు. ఆ కళాకృతికి వాడిన పదార్థాలను జాగ్రత్తగా సేకరించి పరీక్షించారు. ఈ క్రమంలో తేలిందేమిటంటే.. ఆ కళాకృతి సుమారుగా 68వేల ఏళ్ల కిందటిదని గుర్తించారు. గుహలోని రాతిపై చేతిని ఉంచి దానిపై ఎరుపు రంగులో ఉన్న ఓ రకమైన పెయింట్ లాంటి ద్రవాన్ని నోటితో ఊదడం ద్వారా ఆ కళాకృతిని చిత్రీకరించారని సైంటిస్టులు తెలిపారు. అది అచ్చం మానవ చేతి ముద్రలా ఉందని అన్నారు. ఈ పురాతన కళాకృతిని కనుగొన్న వివరాలను నేచర్ అనే జర్నల్‌లో ప్రచురించారు.

కాగా ఇప్పటి వరకు ఇలాంటి పురాతన సృజనాత్మకత లేదా అబ్స్ట్రాక్ట్ ఆర్ట్‌కు పుట్టినిల్లుగా ఐరోపాను భావిస్తూ వచ్చారు. ఎందుకంటే అక్కడ గతంలో రెండు వేర్వేరు సంఘటనల్లో కనుగొన్న పెయింటింగ్‌లు లేదా కళాకృతులు 15వేలు, 30వేల ఏళ్ల నాటివని తేల్చారు. వాటి ఆధారంగా, కళాకృతులను చిత్రీకరించడంలో సృజనాత్మకత కలిగిన మానవుల మూలాలు ముందుగా ఐరోపాలోనే ఉన్నాయని నిర్దారించారు. కనుక ఆయా అంశాల్లో ఎప్పటి నుంచో యూరోప్‌ను మొదటిదిగా పేర్కొంటూ వస్తున్నారు. అయితే తాజాగా ఇండోనేషియాలో బయట పడిన కళాకృతి అంతకన్నా పూర్వ కాలానికి చెందినదని నిర్దారించడంతో పురాతత్వ శాస్త్ర వేత్తలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఇకపై చరిత్రను యూరోప్ పేరిట కాకుండా ఇండోనేషియా పేరిట చెప్పాల్సి ఉంటుందేమోనని అంటున్నారు.
ఇదే విషయమై ఆస్ట్రేలియాలోని గ్రిఫిత్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ ఆడం బ్రూమ్ మాట్లాడుతూ 1990లలో మానవ సృజనాత్మకత, సింబాలిక్ సంస్కృతిపై తాను విద్యార్థులకు బోధించానని, అందుకు గాను యూరోప్‌ను ఉదహరించానని తెలిపారు. అయితే ఇండోనేషియాలో బయట పడ్డ ఈ కళాకృతి వల్ల మానవ సృజనాత్మకత, సింబాలిక్ సంస్కృతి అనేవి ఇంకా ఎంతో పురాతన కాలం నుంచే ఉన్నాయని స్పష్టమవుతుందని, కనుక ఇకపై ఇండోనేషియాను ఉదాహరణగా చెప్పాల్సి వస్తుందని అన్నారు.